రాహుల్‌పై 'చిరు' ఆశ: బిజెపి తగ్గినా.. టిపై కెసిఆర్ ధీమా
న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీతో సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు సోమవారం రాత్రి ఏడున్నర గంటలకు భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్రమంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, కిశోర్ చంద్రదేవ్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జెడి శీలం, పళ్లం రాజు, కిల్లి కృపారాణి, కనుమూరి బాపిరాజు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పనబాక లక్ష్మిలు భేటీ అయ్యారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని చేయాలని వారు రాహుల్‌కు విజ్ఞప్తి చేశారు.
కేంద్రమంత్రులు సవరణల పైన చివరగా రాహుల్ పైనే ఆశలు పెట్టుకున్నారు. గతంలో సిలిండర్ల పెంపు, కొన్ని బిల్లుల విషయాల్లో రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో అందుకు అనుగుణంగా కేంద్రం నిర్ణయాలు జరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదు యూటి చేయడం, భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపడం వంటి అంశాలను రాహుల్ దృష్టికి తీసుకెళ్తే, ఆయన అంగీకరిస్తే బిల్లులో సవరణలు జరిగే అవకాశముందని కేంద్రమంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, కావురి తదితరులు భావిస్తున్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. సోమవారం రాత్రి కెసిఆర్ కేంద్రమంత్రి, జివోఎం సభ్యులు జైరామ్ రమేష్‌తో తుది విడత చర్చలు జరిపారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే అంగీకరించమని, ఆంక్షలు లేని తెలంగాణ ఇస్తే విలీనానికి సైతం కెసిఆర్ సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లు పైన ప్రధాన ప్రతిపక్షం బిజెపి వెనక్కి తగ్గినా మూజువాణి ఓటుతో కాంగ్రెసు పార్టీ నెగ్గిస్తుందని కెసిఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కిషన్ రెడ్డి వివరణ
తమ పార్టీ సీమాంధ్ర నేతల వ్యాఖ్యలు వ్యూహాత్మకమే తప్ప తెలంగాణకు వ్యతిరేకం కాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు. బిల్లుకు తమ పార్టీ తప్పకుండా మద్దతిస్తుందని తెలిపారు. బిజెపి బిల్లుకు మద్దతిచ్చి చిత్తశుద్ది నిరూపించుకుంటుందన్నారు. తెలంగాణ అడ్డుకున్నామనే అపవాదు తమకు వద్దన్నారు. సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి కేంద్రం మెడలు వంచుతామని చెప్పారు. లేదంటే తాము అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరిస్తామన్నారు.












Click it and Unblock the Notifications