Kalpakam Yechury : సీతారాం ఏచూరి తల్లి కన్నుమూత...
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. సీతారాం ఏచూరి తల్లి కల్పకం ఏచూరి కన్నుమూశారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. శనివారం(సెప్టెంబర్ 25) ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆస్పతిలోనే తుది శ్వాస విడిచారు.తన తల్లి మృతదేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం ఆరోగ్య పరిశోధన సంస్థలకు అప్పగించాలని సీతారాం ఏచూరి నిర్ణయించారు.
కల్పకం మృతి పట్ల కేరళ సీఎం విజయన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు సంతాపం తెలియజేశారు. కల్పకం సామాజిక వేత్తగా గుర్తింపు పొందారు. దుర్గాబాయి దేశ్ ముఖ్‌ను ఆమె బాగా అభిమానించేవారు.

కొద్ది నెలల క్రితమే కుమారుడి మృతి...
సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఈ ఏడాది ఏప్రిల్‌తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి తేరుకుంటుండగానే కల్పకం ఏచూరి కన్నుమూయడం ఆ కుటుంబాన్ని మరింత విషాదంలో ముంచెత్తింది. 34 ఏళ్ళ వయసున్న ఆశిష్ ఏచూరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో... మొదట ఢిల్లీలోని హొలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స చేశారు. కానీ పరిస్థితి విషమించడంతో గురు గ్రామ్ లోని మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆరోగ్యం క్షీణించడంతో అక్కడే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆశిష్ ఢిల్లీ కేంద్రంగా పని చేసే ప్రముఖ దినపత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పని చేసేవారు.
'నా పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో మృతి చెందాడని చెప్పడానికి నేను బాధపడుతున్నాను. డాక్టర్లు, నర్సులు, ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లకు, శానిటేషన్ చేసిన సిబ్బందికి, మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి నా తరపున కృతజ్ఞతలు తెలిపుతున్నాను'.అంటూ ఆ సందర్భంగా సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications