పకోడీలు అమ్ముకోవడం బెటర్: కాంగ్రెసుకు అమిత్ షా కౌంటర్
Recommended Video

న్యూఢిల్లీ: పకోడీలు అమ్ముకుంటే తప్పేమిటని, అందులో సిగ్గు చేటయిన విషయం ఏముందని బిజెపి రాజ్యసభ సభ్యుడు అమిత్ షా ప్రశ్నించారు. రాజ్యసభలో ఆయన సోమవారం తొలి ప్రసంగం చేశారు. పకోడీలపై కాంగ్రెసు చేసిన విమర్శలను అమిత్ షా తిప్పికొట్టారు.
ఉద్యోగం ఏదీ చేయకపోవడం కన్నా పకోడీలు అమ్ముకోవడం మంచిదని ఆయన అన్నారు. రోడ్డుపై ఎవరైనా పకోడీలు అమ్ముకుని రూ.200 సంపాదిస్తే దాన్నే ఉద్యోగంగా భావించాలని మోడీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దానిపై కాంగ్రెసు విమర్సలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో అమిత్ షా ఆ వ్యాఖ్యలు చేశారు.

సిగ్గు చేటు కాదు కదా..
కాంగ్రెసు పకోడా రాజకీయాలు చేస్తోందని అమిత్ షా అన్నారు. ఉద్యోగం చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది సిగ్గుచేటు కాదని ఆయన అన్నారు. పకోడీలు అమ్ముకునేవారు అడుక్కోవడం లేదు కదా అని ఆయన అడిగారు.

నిరుద్యోగిగా ఉండడం కన్నా అది సిగ్గు చేటు కాదు..
నిరుద్యోగిగా ఉండడం కన్నా కష్టపడడం తప్పు కాదని అమిత్ షా అన్నారు. అది ఏ మాత్రం సిగ్గుపడాల్సిన విషయం కాదని అన్నారు. ఒక పేదవాడుఇవాళ పకోడీలు అమ్ముకుంటే అతను తర్వాతి కాలంలో పారిశ్రామికవేత్త అయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.

చాయ్‌వాలా కొడుకు ప్రధాని అయినప్పుడు..
చాయ్‌వాలా కుమారుడు ప్రధాని అయినప్పుడు ఏదైనా సాధ్యమేనని అమిత్ షా అన్నారు. కాంగ్రెసు ఈ దేశాన్ని 55 ఏళ్లు పాలించిందని, అనువంశిక పాలన సాగిందని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వ హయాం అంతా కుంభకోణాలమయమని ఆయన విమర్సించారు. కాంగ్రెసు హయంలో విధానపరమైన పక్షవాతం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

దాన్ని గబ్బర్ సింగ్ టాక్స్ అంటారా...
జిఎస్టీ మంచి ఆర్థిక సంస్కరణ అని అమిత్ షా అన్నారు. జిఎస్టీకి కాంగ్రెసు వ్యతిరేకమని అన్నారు. రాష్ట్రాల్లో విశ్వాసాన్ని నింపి జిఎస్టీని అమలు చేస్తున్నామని చెప్పారు. దాన్ని గబ్బర్ సింగ్ టాక్స్ అంటూ హేళన చేయడాన్ని ఆయన తప్పు పట్టారు.

లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత మోడీనే
లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఆ స్థాయిలో పనిచేస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ మాత్రమేనని అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కోటీ 30 లక్షల మంది గ్యాస్ రాయితీలు వదులుకున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications