
సెరెనా విలియమ్స్: శ్వేతజాతీయుల టెన్నిస్‌ను ఏలిన నల్లజాతి రారాణి... 'గ్రేటెస్ట్ లెజెండ్' ప్రస్థానం ఎలా సాగింది?

ఓ పద్నాలుగేళ్ల యువతి యూఎస్ ఓపెన్ టోర్నీతో అంతర్జాతీయ టెన్నిస్‌లోకి అరంగేట్రం చేసింది. అనతికాలంలో ప్రపంచ టెన్నిస్ రారాణిగా అవతరించింది. ఆ కిరీటాన్ని అత్యంత సుదీర్ఘ కాలం ధరించింది.
ఆమె వయసు ఇప్పుడు నలబై ఏళ్లు. ఇరవై ఏడేళ్లు టెన్నిస్ శ్వాసగా బతికిన ఆమె ఇప్పుడు ఆ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. తను ప్రొఫెషనల్ మ్యాచ్ ఆరంభించిన అదే టెన్నిస్ కోర్టులో తుది మ్యాచ్ ఆడింది.
ఆమెకు కన్నీళ్లు వచ్చాయి. అభిమానుల కళ్లు చెమర్చాయి. భావోద్వేగాల నడుమ ఈ లెజెండ్ తన వీడ్కోలు అభివాదం చేశారు. ఆమె తన శైలిలో ట్విర్ల్ చేస్తుండగా.. టీనా టర్రన్ పాప్ క్లాసిక్ 'సింప్లీ ద బెస్ట్' అనే పాట సౌండ్ సిస్టమ్‌లో ప్లే చేశారు.
న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆష్ స్టేడియం నుంచి ఆమె నిష్క్రమిస్తున్నపుడు.. స్టేడియంలో నిలుచోగలిగిన ప్రతి ఒక్కరూ నిలుచుని వీడ్కోలు చెప్పారు. కోర్టు మధ్యలో ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నపుడు సెరెనా విలియమ్స్‌కు కన్నీళ్లు వచ్చాయి. తన కుటుంబానికి, తన టీమ్‌కు, ప్రేక్షకులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు.. ఇన్నాళ్లుగా తనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు.
ఇది రిటైర్మెంట్ అని సెరెనా చెప్పలేదు. తన మరో ముందడుగు వేస్తున్నానని చెప్పారు. ఈ 'గ్రేటెస్ట్ లెజెండ్'కు ప్రపంచం నలుమూలల నుంచీ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

తండ్రి కోచింగ్‌లో అక్కచెల్లెళ్ల ప్రాక్టీస్...
సెరెనా విలియమ్స్ లేని టెన్నిస్‌ను ఊహించటం చాలా కష్టం. ఈ నెలలో 41వ పుట్టిన రోజు చేసుకోనున్న సెరెనా 27 ఏళ్ల సుదీర్ఘ టెన్నీస్ కెరీర్‌లో.. 23 సార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ చాంపియన్‌గా నిలిచారు.
సెరెనా 1981 సెప్టెంబర్ 26న అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో సాంగినావ్ నగరంలో జన్మించారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని కాంప్టన్ నగరంలో పెరిగారు.
ఆమె తల్లి ఒరాసీన్ ప్రైస్ నర్సుగా పని చేసేవారు. తండ్రి రిచర్డ్ విలియమ్స్ ఒక సెక్యూరిటీ సర్వీసు నడిపేవారు. సెరెనా అక్క వీనస్ విలియమ్స్.
వీనస్, సెరెనాలకు వారి తండ్రి రిచర్డ్ టెన్నిస్ నేర్పించారు. వాళ్లని ఊర్లో ఉన్న టెన్నిస్ కోర్టులకు తీసుకెళ్లి ఈ ఆట ఆడాలని ప్రోత్సహించారు. కోచింగ్‌లో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాడని చెప్పేవారు. సిస్టర్స్ ఇద్దరూ చాలా సేపు ప్రాక్టీస్ చేస్తుండేవారు.
వీనస్, సెరెనాలు టెన్నిస్ అకాడమీలో చేరటానికి వీలుగా వీరి కుటుంబం 1991లో ఫ్లోరిడాకు నివాసం మారింది. 1994లో వీనస్ ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగు పెట్టింది. ఆ మరుసటి ఏడాది వీనస్ కూడా ప్రొఫెషనల్ క్రీడలో అరంగేట్రం చేసింది.

గ్రాండ్ స్లామ్ ఫైనల్స్‌లో సిస్టర్స్ పోరు...
వీరి పవర్‌ఫుల్ సర్వ్‌లు, గ్రౌండ్ స్ట్రోక్‌లు, అత్యద్భుత అథ్లెటిక్ సామర్థ్యం అతి తక్కువ కాలంలోనే అందరి దృష్టినీ ఆకర్షించాయి. అక్క వీనస్ తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకుంటుందని చాలా మంది అంచనా వేశారు.
కానీ చెల్లి సెరెనా ముందుగా అది సాధించింది. 1999 యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించింది.
అప్పుడు సెరెనా విలయమ్స్ వయసు కేవలం 17 ఏళ్లు. న్యూయార్క్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో నాటికి ప్రపంచ దిగ్గజాలైన మోనికా సెలెస్‌ను క్వార్టర్ ఫైనల్‌లో, లిండ్సే డావెన్‌పోర్ట్‌ను సెమీ ఫైనల్‌లో, వరల్డ్ నంబర్ వన్ మార్టినా హింగిస్‌ను ఫైనల్‌లో ఓడించి.. సెరెనా కప్పు గెలుచుకుంది.
అదే టోర్నమెంటులో డబుల్స్ టైటిల్‌ను సెరెనా సిస్టర్స్ సొంతం చేసుకున్నారు. (ఈ అక్కచెల్లెళ్లు తమ కెరీర్ ప్రస్థానంలో 14 గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు.)
ఆస్ట్రేలియాలో జరిగిన 2000 సిడ్సీ ఒలింపిక్ గేమ్స్‌లో వీరిద్దరూ డబుల్స్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు.
ఆ తర్వాత 2002 సంవత్సరంలో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టోర్నమెంట్లలో.. మూడు చోట్లా సిస్టర్స్ ఇద్దరూ ఫైనల్స్‌కు వెళ్లి టైటిల్ కోసం తలపడ్డారు. మూడు చోట్లా అక్క వీనస్ మీద చెల్లి సెరెనా గెలిచారు.
ఆ మరుసటి ఏడాది కూడా.. ఆస్ట్రేలియన్, వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో ఫైనల్ మ్యాచ్‌లలో వీనస్‌తో తలపడి సెరెనా గెలిచారు.
- సానియా మీర్జా: 'టెన్నిస్‌కు వీడ్కోలు చెబుతా.. నా చివరి సీజన్ ఇదే’
- టెన్నిస్ జోడీ లియాండర్ పేస్, మహేశ్ భూపతి ఎందుకు విడిపోయారు? తాజా డాక్యుమెంటరీలో ఏముంది?

గర్భంతో ఉండగా ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్...
అలా వరుస సంవత్సరాల్లో సెరెనా విలియమ్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుస్తూ వచ్చారు. మధ్యలో గాయాలతో కొన్ని టోర్నీలకు దూరమయ్యారు. కోలుకుని తిరిగి వచ్చి తన సత్తా చాటారు. 2017లో సెరెనా విలియమ్స్.. రెడిట్ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్‌ను పెళ్లి చేసుకున్నారు.
2017లో సెరెనా విలయమ్స్ ఎనిమిది వారాల గర్భంతో ఉండగా.. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్‌ను గెలుచుకున్నారు. అది ఆమెకు 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్. దానితో ఓపెన్ ఎరాలో ఆల్ టైమ్ విజేతల జాబితాలో స్టెఫీ గ్రాఫ్‌ను అధిగమించారు. ఆమెకన్నా పైస్థానంలో మార్గరెట్ కోర్ట్ ఒక్కరే నిలిచారు.
2017లో సెరెనా తన కుమార్తె అలెక్సిస్ ఒంపియా ఒహానియన్ యూనియర్‌కు జన్మనిచ్చారు. సిజేరియన్ ఆపరేషన్, ఆ తర్వాత కాంప్లికేషన్ల వల్ల సెరెనా ఆరు వారాల పాటు మంచానికి పరిమితమయ్యారు.
https://twitter.com/MichelleObama/status/1565897873992126464
2018లో మళ్లీ టెన్నిస్ మైదానంలోకి అడుగుపెట్టిన సెరెనా.. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టోర్నీల్లో ఫైనల్స్‌కు చేరారు కానీ గెలవలేకపోయారు. ఆ మరుసటి ఏడాది కూడా ఈ రెండు టోర్నీల్లోనూ సెరెనా ఓడిపోయారు.
2020లో న్యూజీలాండ్‌లో ఏఎస్‌బీ క్లాసిక్ టోర్నీలో విజేతగా నిలిచారు. మూడేళ్లలో అదే ఆమె తొలి టైటిల్ గెలుపు. 2021లో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌లో నవోమి ఒసాకా చేతిలో ఓడిపోయారు. ఆ ఏడాది గాయాల కారణంగా వింబుల్డన్‌కు, యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యారు.
ఆ సమయంలోనే ఆమె తన రిటైర్‌మెంట్ ఆలోచన గురించి ఆమె వోగ్ పత్రిక ఇంటర్వ్యూలో చెప్పారు. ''టెన్నిస్ నుంచి ముందడుగు వేయాలి. నాకు ముఖ్యమైన విషయాల వైపు నడవాలి'' అని పేర్కొన్నారు.
అలా ఈ ఏడాది యూఎస్ ఓపెన్ టోర్నీలో వీనస్ చివరి మ్యాచ్ ఆడారు.
- సెరెనా విలియమ్స్‌కు షాకిచ్చిన 19 ఏళ్ల బియాంకా ఆండ్రిస్కూ.. సెరెనా అత్యధిక టైటిళ్ల కలకు బ్రేక్
- సెరెనా విలియమ్స్‌ను ఓడించి తొలి వింబుల్డన్ టైటిల్ గెల్చుకున్న సిమోనా హాలెప్

మైదానం వెలుపలా పోరాటం...
నల్ల జాతి మహిళ అయిన సెరెనా విలియమ్స్ అతిగొప్ప టెన్నిస్ క్రీడాకారిణి అనే దానితో విభేదించే వారు కనిపించరు. ఆమె మైదానంలోనే కాదు.. మైదానం వెలుపలా పోరాడారు.
సంప్రదాయంగా శ్వేతజాతీయుల క్రీడ అయిన టెన్నిస్‌లో తము ఎదుర్కొన్న వివక్ష గురించి, తమ తండ్రి రిచర్డ్ విలియమ్స్‌కు ఎదురైన సమస్యల గురించి అక్కచెల్లెళ్లయిన సెరెనా, వీనస్ ఇద్దరూ మాట్లాడేవారు.
వర్ణవివక్షకు వ్యతిరేకంగా సెరెనా గళం విప్పారు. లింగ సమానత్వం కోసం పోట్లాడారు. టెన్నిస్ పోటీల్లో స్త్రీ, పురుషులకు నగదు బహుతి సమానంగా ఉండాలని కొట్లాడారు.
ఫ్యాషన్, బ్యూటీ, ఫిలాంథ్రఫీ రంగాల్లోనూ సెరెనా ప్రవేశించారు. ఆటల్లోనూ, జీవితంలోనూ ప్రపంచంలో ఎంతో మంది యువతులకు, మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు సెరెనా విలియమ్స్.
https://twitter.com/Wimbledon/status/1557083021278420993
ఇవి కూడా చదవండి:
- ముస్లింలు ఈ స్కూలు మీద ఒత్తిడి తెచ్చారా... విద్యార్థులు చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రార్థన చేయకూడదని చెప్పారా?
- గోదావరి వరదలు: ప్రమాద హెచ్చరికలు అంటే ఏంటి, ఎంత వరద వస్తే వీటిని జారీ చేస్తారు?
- ప్రపంచ జనాభా దినోత్సవం: 'భారత్ జనాభా 2023లో చైనాను మించిపోతుంది' - ఐక్యరాజ్యసమితి
- శ్రీలంక సంక్షోభం లాంటిదే పాకిస్తాన్, నేపాల్ దేశాలలోనూ వస్తే ఏమవుతుంది?
- ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీని భారత జట్టులో ఉంచాలా? తీసేయాలా? - గొంతు విప్పుతున్న మాజీ క్రికెటర్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)