బ్రిడ్జిపై నుంచి బస్సు పల్టీ- 15 మంది దుర్మరణం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తోన్నారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలను చేపట్టారు.
ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి 50,000 రూపాయలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 25,000 రూపాయల ఎక్స్‌గ్రేషియోను అందించనున్నట్లు చెప్పారు.

ఈ ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఖర్గాన్ జిల్లాలో ఈ ప్రమాదం సంభవించింది. జిల్లాలోని శ్రీఖండ్ నుంచి ఇండోర్‌కు బయలుదేరింది ఎంపీ 10 పీ 7755 అనే ప్రైవేటు బస్సు. మార్గమధ్యలో డోంగర్‌గావ్ సమీపంలో ప్రమాదానికి గురైంది. బోరాద్ నదిపై నిర్మించిన బ్రిడ్జిపై నుంచి వెళ్తోన్న సమయంలో అదుపు తప్పింది. వేగంగా బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీ కొట్టి కిందపడింది. సుమారు 30 అడుగుల ఎత్తు ఉన్న వంతెన అది.
అంతపై నుంచి కిందపడేసరికి బస్సు ముందుభాగం మొత్తం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరణించిన వారిలో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ ఉన్నారు. సమాచారం అందిన వెంటనే ఖర్గాన్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ధరం వీర్ సింగ్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సు ప్రయాణికులతో కిటకిటలాడుతోందని ప్రత్యక్ష సాక్షులు వివరించినట్లు పేర్కొన్నారు. ఓవర్ లోడ్ కారణంగా బస్సు అదుపు తప్పిందనే కోణంలో దర్యాప్తు సాగిస్తామని ఎస్పీ చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా బస్సు కండీషన్ గురించి దర్యాప్తు చేస్తామని, ఫిట్‌నెస్ లేని బస్సులపై కఠిన చర్యలను తీసుకునేలా ఆదేశాలను జారీ చేస్తామని వివరించారు.












Click it and Unblock the Notifications