జాతరలో ఘోరం- ఏడుమంది దుర్మరణం
Goa Stampede 2025: గోవాలో దిగ్భ్రాంతికర ఘటన సంభవించింది. ఓ జాతరలో భారీగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుమంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంటోంది. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక- విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందజేస్తోన్నారు.
ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణె.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సమగ్ర నివేదికను అందజేయాలంటూ జిల్లా అధికార, పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.
గోవా షిర్గావ్‌లో కొలువుదీరిన లైరాయ్ అమ్మవారి జాతరలో ఈ దుర్ఘటన సంభవించింది. ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పంచమి నాడు అమ్మవారి జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయిదు రోజుల పాటు జాతర సాగుతుంది. జాతరలో భాగంగా తొలుత కర్రలతో 15 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు, 21 అడుగుల ఎత్తు ఓ వేదికను నిర్మిస్తారు.
అనంతరం దానికి నిప్పు అంటించి, దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు భక్తులు. నిప్పులు తొక్కుతూ 11కు సార్లకు పైగా అగ్నిప్రదక్షిణలు చేస్తారు. సంప్రదాయబద్ధంగా తప్పెట్లు మోగిస్తూ ఇందులో పాల్గొంటారు. ఈ జాతర మొత్తానికీ ఇదే హైలైట్. ఈ ప్రదక్షిణ చేయడాన్ని ఢోండ్స్ అని పిలుస్తారు.
గోవా పురాణాల ప్రకారం.. ఏడుమంది అక్క దేవతల్లో లైరాయ్ అమ్మవారు ఒకరు. షిర్గావ్‌లో లైరాయ్ అమ్మవారు కొలువుదీరగా, ముల్గావ్‌లో కెల్బాయ్, మాయెంలో మహామయి, మపుసాలో మీరాబాయి/ మీరాబాలిస్, మోర్జిమ్‌లో మోర్జైలో మిగిలిన ఆలయాలు ఉన్నాయి. మరో ఇద్దరు దేవతలు అజిదీప, షిట్లైకు ఆలయాలు లేవు. కర్ణాటకలోని కార్వారలో వెలిసినట్లుగా ఆధారాలు ఉన్నాయి.
శుక్రవారం రాత్రి అమ్మవారి జాతర వైభవంగా ఆరంభమైంది. గోవా మాత్రమే కాకుండా పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు జాతరకు వచ్చారు. రాత్రంతా మేలుకుని అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీగా తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఈ ఘటనలో ఏడుమంది దుర్మరణం పాలయ్యారు. 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని బంబోలిన్‌లోని గోవా మెడికల్ కాలేజీ తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications