సుప్రీంకోర్టు తలుపు తట్టిన శరద్ పవార్
మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అజిత్ పవార్ పార్టీకి కేటాయించిన గడియారం గుర్తును నివారించి ఆ పార్టీకి వేరే గుర్తును కేటాయించాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఓటర్లలో గందరగోళాన్ని నివారించేందుకు అజిత్ పవార్ పార్టీకి గడియారం గుర్తుకు బదులుగా వేరే గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు. గడియారం గుర్తుతో తమ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 25 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు.
ఓటర్ల మధ్య గందరగోళం
ఎన్ సీపీ రెండు వర్గాలుగా చీలిపోయిన తర్వాత శరద్ పవార్ వర్గానికి భారత ఎన్నికల సంఘం బాకా ఊదుతున్న వ్యక్తి గుర్తును ఎన్నికల గుర్తుగా కేటాయించింది. అయితే తమకు గడియారం గుర్తుతో అనుబంధం ఉందని, అజిత్ పవార్ వర్గం గడియారాన్ని ఉపయోగించుకుంటే ఓటర్లను తప్పుదారి పట్టించినట్లవుతుందన్నారు. దీనివల్ల ఎన్నికలు కూడా నిస్పక్షపాతంగా జరగవన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవలే జరిగిన లోక్ సభ ఎన్నికల సమయంలో ఓటర్ల మధ్య చోటుచేసుకున్న గందరగోళాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు.

అక్టోబరు 15న విచారణ
త్వరలో జరిగేది అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఈ గుర్తుపై మరింత గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందన్నారు. శరద్ పవార్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈనెల 15వ తేదీన విచారణ జరపబోతోంది. గడియారం గుర్తు ఎవరికి కేటాయిస్తుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్రలో కొన్నాళ్ల క్రితం శివసేన పార్టీని చీల్చి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. తర్వాత శరద్ పవార్ ఎన్ సీపీలో చీలిక తీసుకువచ్చి అతని మేనల్లుడైన అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గానికి అధికారంలో స్థానం కల్పించింది. ప్రస్తుతం అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications