కాంగ్రెస్ లేకుండా బీజేపీపై పోరు అసాధ్యం-యూపీఏ సారధ్యం నాకొద్దు-పవార్ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా బీజేపీ పటిష్టమవుతున్న వేళ... ప్రత్యామ్నాయ రాజకీయం లేకపోతే తలెత్తే పరిణామాలపై విపక్షాలు ఆలోచనలో పడుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన విపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుండటం, ఆ స్ధానాన్ని భర్తీ చేసే స్ధాయిలో ప్రాంతీయ పార్టీలు లేకపోవడం వంటి కారణాలతో మరోసారి ఎన్డీయే సర్కార్ ఏర్పాటైనా ఆశ్చర్యం లేదనే వార్తలు వస్తున్నాయి. దీంతో బీజేపీపై పోరులో కాంగ్రెస పార్టీ ఉండి తీరాల్సిందేనని రాజకీయ దిగ్గజం, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి సూచించారు.

పవార్ కీలక వ్యాఖ్యలు
జాతీయ స్ధాయిలో యూపీఏ బలహీన పడిన నేపథ్యంలో విపక్ష రాజకీయాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్టలోని కొల్హాపూర్ లో నిన్న జరిగిన బహిరంగసభలో మాట్లాడిన పవార్.. జాతీయ రాజకీయాలపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్ధాయిలో ఎన్డీయేకు ప్రత్యామ్నాయంగా జాతీయ కూటమి ఏర్పాటు కావాల్సిన అవసరాన్ని పవార్ మరోసారి గుర్తుచేశారు. ఇందుకోసం చేయాల్సిన ప్రయత్నాలపైనా పవార్ పలు సూచనలు చేశారు.

కాంగ్రెస్ లేకుండా అసాధ్యం
ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్నప్పటికీ అధికార బీజేపీపై పోరు సాగించాలంటే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. ముఖ్యంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కార్యకర్తల బలం కలిగిన కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీపై పోరు సాధ్యం కాదని పవార్ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో లేకపోవచ్చు కానీ అది అఖిల భారత పార్టీ అని పవార్ తెలిపారు. దేశంలోని ఏమూలకు వెళ్లినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనిపిస్తారంటూ వ్యాఖ్యానించారు.

ప్రాంతీయ పార్టీలున్నా..
దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలీయశక్తులుగా ఉన్నాయని పవార్ తెలిపారు. బెంగాల్ లో టీఎంసీతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో అవి ప్రభావం చూపలేకపోతున్నాయని పవార్ వెల్లడించారు. అందుకే బీజేపీపై పోరులో విస్తృత స్దాయి ఉన్న కాంగ్రెస్ పార్టీ అనివార్యమని పవార్ తెలిపారు. అలాగే యూపీఏ బలంగానే ఉండాలని, కానీ యూపీఏ కూటమికి తాను సారధిగా ఉండాలని కోరుకోవడం లేదన్నారు.

భారత్ కు పుతిన్ బెడదలేదంటూ..
దేశంలో అధికార బీజేపీ లేదా ఎన్డీయేకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ బలమైన ప్రత్యామ్నాయంగా ఉండాలంటూ గడ్కరీ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసిన పవార్.. దేశంలో ఒకే పార్టీ బలంగా ఉంటే నాయకులు పుతిన్ లా మారతారంటూ వ్యాఖ్యానించారు. కానీ భారత్ కు అలాంటి బెడద లేదనే భావిస్తున్నట్లు పవార్ వెల్లడించారు. ప్రస్తుతం రష్యాలో బలమైన నేతగా ఉన్న పుతిన్.. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పవార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications