శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా వందకోట్ల ఆస్తులు జప్తు; బిట్ కాయిన్ కేసులో ఈడీ మెరుపునిర్ణయం
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా లకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. శిల్పా శెట్టి మరియు ఆమె భర్త రాజ్ కుంద్రాకు చెందిన 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది.
శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాల వంద కోట్ల విలువైన ఆస్తులు జప్తు
క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ కి సంబంధించి మనీలాండరింగ్ మోసాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా లకు చెందిన దాదాపు 100 కోట్ల స్థిర, చర ఆస్తులను జప్తు చేసింది.శిల్పా శెట్టి పేరు మీద ఉన్న ముంబైలోని జుహు ప్లాట్ తో పాటు, పూణేలోని బంగ్లాను, రాజ్ కుంద్రా కు చెందిన ఈక్విటీ షేర్లను సైతం ఈడీ అటాచ్ చేసింది.

బిట్ కాయిన్ కేసులో రాజ్ కుంద్రా
బిట్ కాయిన్ లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని అమాయక జనాలను మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా మోసం చేశారని, జనాల నుండి 6600 కోట్ల రూపాయలు వసూలు చేసి, డబ్బు చేతికి వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించి పెట్టుబడి పెట్టినవారిని మోసం చేశారని నమోదైన కేసులో రాజ్ కుంద్రా కూడా నిందితుడే. మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు పలుచోట్ల దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
బిట్ కాయిన్ కేసులో నిందితుల వివరాలివే
ఈ కేసులో సింపి భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ లను ఈడి అరెస్ట్ చేసింది. ఈ ముగ్గురు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, అసలు ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితులు అజయ్ భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అసలు ఈ మోసానికి సంబంధించిన మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్ 2022లో మృతిచెందారు.
రాజ్ కుంద్రా వద్ద బిట్ కాయిన్స్ .. ఈడీ ఆయన ఆస్తుల అటాచ్
ఆయన బ్రతికున్న సమయంలో రాజ్ కుంద్రా ఆయన వద్ద నుండి 285 బిట్ కాయిన్లు తీసుకున్నారని ఈడీ పేర్కొంది. ఇప్పటికీ ఆ బిట్ కాయిన్స్ ఉన్నాయని ఆయన వద్దే ఉన్నాయని వాటి విలువ 150 కోట్లుగా ఉంటుందని ఈడి వెల్లడించింది. ఈ క్రమంలోనే శిల్పా శెట్టి , రాజ్ కుంద్రాకు చెందిన దాదాపు 100 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ప్రస్తుతం సినీ వర్గాలలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications