ప్రధాని మోడీకి షాక్ ఇచ్చిన శివసేన, ఎంత దిగజారారు, ఒక్కడి కోసం వంద మంది, పాక్!
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని పాతాళానికి దిగజార్చారని బీజేపీ మిత్రపక్షం శివసేన మండిపడింది. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లో జరిగిన అభివృద్ది గురించి మాట్లాడకుండా మొఘల్ సామ్రాజ్యం, వారి పాలన గురించి మాట్లాడుతున్నారని శివసేన విమర్శించింది. మీరు ఉన్న స్థాయికి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు అవసరమా ? అంటూ శివసేన ప్రధాని నరేంద్ర మోడిని ప్రశ్నించింది.

అందుకే కాంగ్రెస్!
దిగజారుడు రాజకీయాలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీని గుజరాత్ ప్రజలు 22 ఏళ్లు పక్కన పెట్టారని, ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ అభివృద్ది మంత్రం చదవకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని శివసేన అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో విమర్శించింది.

మోడీకి అవసరమా?
ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో అనవసరంగా ఉద్వేగానికి లోనయ్యారని, ఇంత అట్టడుగుస్థాయి ప్రచారానికి దిగాల్సిన అవసరం బీజేపీకి ఏం వచ్చిందని శివసేన అధికార పత్రిక సామ్నా సూటిగా ప్రశ్నించింది.

ఒక్కడి కోసం వంద మంది!
కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక్క రాహుల్ గాంధీని ఓడించడానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు(బీజేపీ) గుజరాత్ లో ప్రచారం చేశారని శివసేన గుర్తు చేసింది. ఒక్క రాహుల్ గాంధీని ఎదుర్కోవడానికి ఇలా ప్రచారం చేసి ఆయన ఇమేజ్ ను మీరే పెంచారని శివసేన ఆరోపించింది.

రాజకీయ నిరుద్యోగి
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక రాజకీయ నిరుద్యోగి మణిశంకర్ అయ్యర్ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి నీచ్ (నీచుడు) అనే వ్యాఖ్యలు చేశారని శివసేన గుర్తు చేసింది. మణిశంకర్ అయ్యర్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయన స్థాయికి మించి తీవ్రస్థాయిలో స్పందించారని శివసేన విమర్శించింది.

మీరు గుజరాత్ నాయకుడా?
మణిశంకర్ అయ్యర్ ఈ వ్యాఖ్యలతో తననే కాదు గుజరాత్ రాష్ట్ర ప్రజలు అందరినీ అవమానించారని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను శివసేన తప్పుబట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ నాయకుడిగా కంటే ప్రాంతీయ నాయకుడిగానే తనను తాను ఊహించుకుంటున్నారని శివసేన విమర్శించింది.

హిందూ దేశం కోసం
భారతదేశ ప్రజల గౌరవ ప్రతిష్టల కోసం, హిందూ దేశ ప్రతిష్ట కోసం ప్రధాని నరేంద్ర మోడీ నిలబడాలని మేం కోరుకుంటున్నాం అని శివసేన చెప్పింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికీ తాను గుజరాతీ అనే భావనలోనే ఉన్నారని, ఆయనను ఎప్పుడో జాతీయ నాయకుడిగా గుర్తించామని తెలిసినట్లు లేదని శివసేన ఎద్దేవ వచేసింది.

పాకిస్థాన్ కు ఏం లింక్?
గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకుంటుందన్న ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను శివసేన తప్పుబట్టింది. కాంగ్రెస్ నాయకులను ఎదుర్కొవడానికి పాకిస్థాన్ అంశం తెరమీదకు తీసుకు వస్తున్నారా ? అంటూ శివసేన తన అధికార పత్రిక సామ్నాలో బీజేపీని ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications