50:50: శివసేనకు పెరుగుతున్న మద్దతు, మీతోనేనంటూ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు
ముంబై: తమకు కూడా రెండున్నరేళ్లపాటు ముఖ్యమంత్రి కూర్చి కావాలంటూ పట్టుబడుతున్న శివసేన పార్టీకి మరో చిన్నపార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే మద్దతు ఇస్తామని ప్రకటించారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన ఈ ఎమ్మెల్యేలు శివసేనకు మద్దతిస్తున్నట్లు శనివారం వెల్లడించారు.
ఈ మేరకు శివసేన అధినే ఉద్ధవ్ థాక్రేకు ప్రహర్ జనశక్తి పార్టీ అధినేత, అచల్పూర్ ఎమ్మెల్యే బచ్చు కదు, అతని సహచరుడు, మేల్‌ఘాట్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ పటేల్ లేఖ రాశారు. వీరిద్దరూ కూడా అమరావతి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు.
బచ్చు కదు తమ పార్టీకి మద్దతు ఇవ్వడం తాము ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకునేందుకు మరింత శక్తినిచ్చిందని శివసేన నేత ఒకరు చెప్పారు. 2014-2019 కాలంలో తాము బీజేపీతో సర్దుకుపోయామని, కానీ, ఇప్పుడు తమకు అధికారంలో వాటా కావాల్సిందేనని స్పష్టం చేశారు.

అక్టోబర్ 24న వెలువడిన ఫలితాల్లో బీజేపీకి 105 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అంతకుముందు 2014లో 122 స్తానాలు వచ్చాయి. కాగా, శివసేనకు గతంలో కంటే ఎక్కువగానే 56 స్థానాలు రావడంతో అధికారంలో తమకు వాటా ఇవ్వాలంటూ బీజేపీని డిమాండ్ చేస్తోంది.
ఐదేళ్ల ముఖ్యమంత్రి పదవి కాలాన్ని చెరిసగం(50:50) పంచుకునేందుకు సిద్ధమని రాతపూర్వకంగా హామీ ఇస్తేనే తాము బీజేపీకి మద్దతు ఇస్తామంటూ శిసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీ మాత్రం ఇందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
ఇది ఇలావుంటే, మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఆదిత్య థాక్రే(ఉద్ధవ్ థాక్రే కుమారుడు) అంటూ ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శివసేన కార్యకర్తలు ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ పోస్టర్లపై బీజేపీ స్థానిక నేతలు మండిపడుతున్నారు.
కాగా, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో పర్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన ఆదిత్య థాక్రే భారీ మెజారిటీతో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. మొదటి సారి ఎమ్మెల్యే అయిన ఆదిత్య థాక్రేని సీఎం చెయ్యాలని శివసేన నాయకులు నిర్ణయించారు. రాజకీయ అనుభవం ఏమాత్రం లేని ఆదిత్య ఠాక్రేకు సీఎం పదవి కోరడమేంటని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications