‘పాక్ స్నేహంతో మోడీకి భారీ మూల్యం తప్పదు’
ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఆకస్మికంగా పాకిస్థాన్‌ను సందర్శించడంపై బిజెపి మిత్రపక్షమైన శివసేన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. భారత నెత్తుటిలో ‘నానుతున్న' పాకిస్థాన్ గడ్డను ‘ముద్దాడినందుకు' మోడీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.
అంతేగాక, దాయాది దేశానికి చేరువయ్యేందుకు మోడీ ఎంతగా ప్రయత్నిస్తే, అంతలా పతనమవడం ఖాయమని, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కె అద్వానీ వంటి బిజెపి మహానాయకుల రాజకీయ గ్రాఫ్ కూడా అలాగే పతనమైందని శివసేన సోమవారం పేర్కొంది.

‘పాకిస్థాన్‌కు చేరువయ్యేందుకు ప్రయత్నించిన ఏ నాయకుడూ రాజకీయాల్లో ఎంతోకాలం కొనసాగలేడన్న విషయం గతంలో ఎన్నోసార్లు బలంగా రుజువైంది. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం లేదు. అద్వానీ గతంలో పాక్ జాతిపిత మొహమ్మద్ అలీ జిన్నా సమాధిని సందర్శించి ఆయనను ప్రశంసించారు. ఆ తర్వాత నుంచి అద్వానీ రాజకీయ గ్రాఫ్ పతనవడంతో ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో మూలకు జరిగారు' అని పార్టీ పత్రిక ‘సామ్నా' సంపాదకీయంలో శివసేన వ్యాఖ్యానించింది.
బిజెపికి అత్యంత ప్రాచీన సైద్ధాంతిక భాగస్వామి అయిన శివసేన మాజీ ప్రధాని అతల్ బిహారీ వాజ్‌పేయికి, పాక్ మాజీ నియంత జనరల్ పర్వెజ్ ముషారఫ్‌కు మధ్య జరిగిన భేటీలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. అంతేగాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన మంత్రి ముందస్తు ప్రకటన చేయకుండా పాకిస్థాన్‌ను సందర్శిస్తే బిజెపి ఎలా ప్రతిస్పందించేదో తెలుసుకోవాలనుకుంటున్నామని శివసేన పేర్కొంది.












Click it and Unblock the Notifications