షాకింగ్ : దానం చెయ్యలేదని వ్యక్తిని కత్తితో పొడిచిన బిచ్చగాడు!!
సమాజంలో రోజురోజుకు ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా ఎవరి మీద దాడి చేస్తారు అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి బిక్షం అడిగితే ఇవ్వలేదని యాచకుడు కత్తితో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
దానం చెయ్యకుంటే దుర్భాషలాడిన యాచకుడు
ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లా నాయి బస్తీ 24లో ఓ బిచ్చగాడు రోడ్డుపై వెళ్తున్న వారిని దానం చేయమని అడిగేవాడు. ఇక ఎవరైతే తనకు దానం చేయలేదో వారి పైన దుర్భాషలాడేవాడు అయితే తాజాగా ఓ వ్యక్తి ఆ రోడ్డులో వెళుతుండగా యాచకుడు అతడిని దానం చేయాలని వేడుకున్నాడు. కానీ ఆ వ్యక్తి దానం చేయలేదు దీంతో యాచకుడు అతనిని నోటికొచ్చినట్టు దుర్భాషలాడటం ప్రారంభించాడు.

దానం చెయ్యలేదని కత్తితో దాడి చేసిన యాచకుడు
యాచకుడి తీరు నచ్చని వ్యక్తి యాచకుడి మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో యాచకుడు ఒక్కసారిగా కత్తితో ఆ వ్యక్తి పైన దాడి చేశాడు. ఊహించని విధంగా యాచకుడు చేసిన దాడితో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు. ఈ ఘటనతో కొందరు పోలీసులకు సమాచారం అందించగా మరికొందరు దాడి చేసిన యాచకుడిని పట్టుకున్నారు.
యాచకుడు అరెస్ట్.. వ్యక్తి పరిస్థితి విషమం
పోలీసులకు యాచకుడిని అప్పగించారు ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆ వ్యక్తి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది.అయితే పోలీసులు యాచకుడిని అరెస్ట్ చేసి అతని గురించి విచారిస్తున్నారు. అతని నేర చరిత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. కత్తితో పొడిచిన యాచకుడు వికలాంగుడని పోలీసులు చెబుతున్నారు.
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అతను కిరాత్ పూర్ స్థానిక నివాసి అని, అతడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుండి వ్యక్తిపై దాడి చేసిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే విచారణ అనంతరం దాడి చేసిన యాచకుడిని చట్ట ప్రకారం శిక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఒక్కసారిగా యాచకుడు దానం చేయలేదని వ్యక్తిపై దాడి చేసిన ఘటన స్థానికంగా ప్రతి ఒక్కరికి భయాన్ని కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications