'దీపికా పదుకొణేపై విమర్శలా.. జేఎన్‌యూకి కాకుండా నాగ్‌పూర్‌కి వెళ్లాల్సిందా?'
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే మంగళవారం సాయంత్రం జేఎన్‌యూ క్యాంపస్‌లో ప్రత్యక్షమవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. గత ఆదివారం జేఎన్‌యూ విద్యార్థులపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ సాగిన నిరసన కార్యక్రమంలో దీపికా పాల్గొన్నారు. విద్యార్థులకు సంఘీభావంగా దాదాపు 15 నిమిషాల పాటు ఆమె అక్కడ మౌనంగా నిలుచున్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఐషే ఘోష్,మాజీ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ పాల్గొన్నారు. వామపక్ష విద్యార్థులతో కలిసి దీపికా నిరసన కార్యక్రమంలో పాల్గొనడాన్ని రైట్ వింగ్ శక్తులు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. ఆమె తాజా సినిమా ఛపాక్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ ట్విట్టర్‌లో హాష్ ట్యాగ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీపికను విమర్శిస్తున్నవారికి కాంగ్రెస్ గట్టి కౌంటర్ ఇచ్చింది.

నాగ్‌పూర్‌కి వెళ్లమంటారా..? :
'ఈ ప్రభుత్వం అసలు స్వరూపం ఇది. ఒక నటి విద్యార్థులకు మద్దతుగా సంఘీభావం ప్రకటించినందుకు ఇంతలా దిగజారిపోయి ఆమెకు వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తారా..?, ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియా క్యాంపెయిన్స్ చేస్తారా?' అని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖెరా మండిపడ్డారు. జేఎన్‌యూ విద్యార్థులకు మద్దతుగా అక్కడికి వెళ్తే.. దాన్ని సినిమా ప్రమోషన్ కోసం అంటూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అయితే సినిమా ప్రమోషన్ కోసం ఆమె నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లాల్సిందా? అంటూ ఎద్దేవా చేశారు.

మోదీపై విమర్శలు :
నిజానికి ఇలాంటి తరుణంలో ప్రధాని మోదీ జేఎన్‌యూ క్యాంపస్‌కి వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతారని భావించామని ఖెరా అభిప్రాయపడ్డారు. కానీ దానికి బదులు బీజేపీ దీపికా పదుకొణేని విమర్శిస్తూ,ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ నిర్వహిస్తోందని మండిపడ్డారు.

బాలీవుడ్ మద్దతు.. :
బాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే జేఎన్‌యూ విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. నటి తాప్సీ,దర్శకుడు అనురాగ్ కశ్యప్ తదితరులు విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. అదే బాటలో నటి దీపికా పదుకొణే కూడా జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావంగా క్యాంపస్‌కి వెళ్లారు. నిజానికి దీపిక నుంచి ఇలాంటి చర్యను ఎవరూ ఊహించలేదు. విద్యార్థులకు దీపిక మద్దతు పలకడంపై వామపక్ష,అభ్యుదయ వాదులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. బీజేపీ సహా రైట్ వింగ్ గ్రూపులు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

కొనసాగుతున్న విచారణ :
జేఎన్‌యూ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. వీడియో ఫుటేజీ ఆధారంగా ఢిల్లీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. దాడికి సంబంధించి బయటకు వచ్చిన పలు స్క్రీన్ షాట్స్‌ను కూడా వారు పరిశీలిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద జేఎన్‌యూ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా.. దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications