వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రద్ధ వాల్కర్, అఫ్తాబ్ పూనావాలా: ‘ఫ్రిడ్జ్ మర్డర్’ మీద వస్తున్న సంచలన వార్తల్లో నిజానిజాలేంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

భారతదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ'అత్యంత దారుణమైన హత్య’పై సమాజం, మీడియా విపరీతంగా దృష్టి పెట్టాయి.

మూడేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడనే ఆరోపణలపై అఫ్తాబ్ పూనావాలా అనే వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

అతడు శ్రద్ధ వాల్కర్ అనే 27 ఏళ్ల మహిళను మే నెలలో హత్య చేశాడని, ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడని, వాటిని తన ఇంట్లో ఫ్రిడ్జ్‌లో దాచాడని, గత కొన్ని నెలల పాటు ఒక్కో ముక్కను తీసుకెళ్లి నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు.

అఫ్తాబ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. తన మీద ఆరోపణల గురించి అతడు బహిరంగ ప్రకటన ఏదీ చేయలేదు. అయితే.. 'నా గురించి వ్యాపిస్తున్న సమాచారం సరైంది కాదు. పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నా’ అని అతడు మంగళవారం నాడు ఒక కోర్టుకు చెప్పాడు.

శ్రద్ధా వాల్కర్ కనిపించటం లేదంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆమె హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది.

అప్పటి నుంచీ ఈ హత్యకు సంబంధించి భయంకరమైన వివరాలు దేశంలోని మీడియాలో పతాకశీర్షికలుగా కనిపిస్తున్నాయి. పేరు చెప్పని పోలీసు వర్గాలు, స్థానిక పాత్రికేయులు నిర్ధారణ కాని సమాచారాన్ని, విశేషాలను ప్రసారం చేస్తూ ప్రచురిస్తున్నారు.

శ్రద్ధా వాల్కర్ హత్యపై నిరసనలు

ఈ నేరాన్ని 'ఫ్రిడ్జ్ మర్డర్’గా పిలుస్తున్నారు. ఈ కేసు మీద ప్రజల్లో విపరీతమైన ఆసక్తి ఉండటంతో వార్తా వెబ్‌సైట్లు ఈ కేసు దర్యాప్తు మీద లైవ్ పేజీలు నడుపుతూ నిరంతరం అప్‌డేట్ చేస్తున్నాయి.

శ్రద్ధ వాల్కర్ హత్యపై ఆగ్రహం వీధుల్లోకి పొంగింది. నిరసనకారులు అఫ్తాబ్‌కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ అతడి దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ హత్యోదంతంపై మీడియా కవరేజ్ అత్యంత తీవ్రంగా ఉండటం పట్ల లాయర్లు, మాజీ పోలీసు అధికారులు, ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కేసు విషయంలో మీడియా తీరు 'అత్యంత బాధ్యతారాహిత్యం’గా ఉందని ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ తప్పుపట్టారు.

ఈ కేసు మీద మీడియా కవరేజీ ''బంతి బంతికీ వ్యాఖ్యానిస్తూ, విశ్లేషించే క్రికెట్ కామెంటరీ లాగా చేయటం.. కేసు దర్యాప్తు లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. మృతురాలిని అగౌరవపరుస్తుంది’’ అని ఆయన బీబీసీతో పేర్కొన్నారు.

ఈ హత్యపై గుక్కతిప్పుకోకుండా కొనసాగుతున్న మీడియా కవరేజీ వల్ల.. నిజమేదో అబద్ధమేదో తెలియకుండా పోయింది. శ్రద్ధ, అఫ్తాబ్‌లు ఎలా కలిశారనే అంశంతో సహా ఈ కేసు వాస్తవాలపై స్పష్టత లేకుండా గందరగోళంగా, పరస్పర విరుద్ధమైన కథనాలు ముంచెత్తుతున్నాయి.

శ్రద్ధ వాల్కర్, అఫ్తాబ్ పూనావాలాలు ముంబై నగరంలో ఒకే ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ.. వారిద్దరూ బంబుల్ అనే ఒక డేటింగ్ యాప్ ద్వారా కలిసినట్లు పోలీసులు చెబుతున్నారు.

అయితే, శ్రద్ధ కనిపించడం లేదంటూ ఆమె తండ్రి అక్టోబర్ ఆరంభంలో ముంబయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో... శ్రద్ధ, అఫ్తాబ్‌లు 2018లో ఒక కాల్ సెంటర్‌లో కలిశారని, వారిద్దరూ అక్కడ పనిచేసే వారని చెప్పారు.

అఫ్తాబ్‌తో శ్రద్ధ సంబంధాన్ని ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించటంతో ఆమెకు, ఆమె కుటుంబానికి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

''మేం హిందువులం, అఫ్తాబ్ ముస్లిం. మేం మా మతం వెలుపల కానీ, కులం వెలుపల కానీ పెళ్లి చేసుకోం. కాబట్టి అఫ్తాబ్‌తో కలిసి ఉండవద్దని ఆమెను ఒప్పించటానికి మేం ప్రయత్నించాం’’ అని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే శ్రద్ధ, అఫ్తాబ్‌లు 2019లో సహజీవనం ప్రారంభించారు. ఈ ఏడాది ఆరంభంలో దిల్లీకి నివాసం వచ్చారు. ఛతర్‌పూర్ పహాడీ ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారు.

శ్రద్దా వాల్కర్ హత్య కేసు

వీరిద్దరూ తరచుగా పోట్లాడుకునే వారని, శ్రద్ధ మీద అఫ్తాబ్ దౌర్జన్యం చేసేవాడని వీరిద్దరి స్నేహితులు, పోలీసులు చెప్తున్నారు.

శ్రద్ధ తనను పెళ్లి చేసుకోవాలంటూ అఫ్తాబ్‌ను ఒత్తిడి చేయటం ప్రారంభించారని, ఈ క్రమంలో ''మే 18వ తేదీన అఫ్తాబ్ కోపంలో ఆమెను గొంతు నులిమి చంపేశాడ’’ని సీనియర్ పోలీస్ అధికారి అంకిత్ చౌహాన్ ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.

శ్రద్ధ కొన్ని నెలలుగా తమతో మాట్లాడలేదని, ఆమె ఫోన్ స్విచాఫ్ వస్తోందని ఆమె స్నేహితులు శ్రద్ధ తండ్రిని అప్రమత్తం చేయగా ఆయన ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శ్రద్ధ 2020 సంవత్సరంలో ముంబై పోలీసులకు చేతిరాతతో ఇచ్చిన ఫిర్యాదు ఒకటి బుధవారం వెలుగుచూసినట్లు దిల్లీ పోలీసులు చెప్పారు. ''అఫ్తాబ్ తనను కొట్టాడని, తనను చంపి ముక్కలు ముక్కలు చేస్తానని బెదిరిస్తున్నాడని’’ శ్రద్ధ ఆ ఫిర్యాదులో ఆరోపించారని, రెండేళ్ల తర్వాత అదే జరిగిందని వారు అంటున్నారు.

దీనిపై విమర్శలు రావటంతో.. ఆ కేసును తాము దర్యాప్తు చేశామని, ఆ గొడవ సమసిపోయిందని, వివాదమేమీ లేదని శ్రద్ధ రాతపూర్వకంగా స్టేట్‌మెంట్ ఇవ్వటంతో ఆ కేసును మూసివేశామని ముంబయి పోలీసులు చెప్పారు.

https://twitter.com/ANI/status/1592380780462104576

ఇప్పటివరకూ తెలిసిన విషయాలేమిటి?

'నువ్వు ఏం చేశావో నీకు తెలుసా?’ అని మంగళవారం నాడు అఫ్తాబ్‌ను కోర్టు ప్రశ్నించినపుడు, ''జరిగిందంతా క్షణికావేశంలో జరిగింది. ఉద్దేశపూర్వకంగా కాదు’’ అని అతడు బదులిచ్చాడు.

అతడి ప్రకటనను కొందరు నేరాంగీకారంగా వ్యాఖ్యానించారు. కానీ అతడి న్యాయవాది అబినాష్ కుమార్ మాత్రం, హత్య చేసినట్లు అఫ్తాబ్ నేరాన్ని అంగీకరించాడనడాన్ని తిరస్కరించారు. ''అతడు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నాడు’’ అని చెప్పాారు.

అఫ్తాబ్‌ను అరెస్ట్ చేసిన వెంటనే.. అతడు నేరాన్ని అంగీకరించాడని, ఆధారాలను కనుగొనటానికి కొన్ని వివరాలు చెప్పాడని పోలీసులు ప్రకటించారు.

ఆ తర్వాత అతడి అపార్ట్‌మెంట్‌ను పోలీసులు సోదా చేశారు. అతడిని సమీపంలోని అడవికి తీసుకెళ్లారు. ''శ్రద్ధ శరీర భాగాలను అతడు అక్కడ పారేశాడ’’ని పోలీసులు పేర్కొన్నారు.

కొన్ని ఎముకలు, శరీర భాగాలు తమకు దొరికాయని, వాటిని ఫోరెన్సిక్ ఎనాలసిస్‌కు పంపించామని, అవి శ్రద్ధ శరీర భాగాలేనా అనేది తెలుసుకోవటానికి వాటి డీఎన్‌ఏని శ్రద్ధ తండ్రి డీఎన్ఏతో పోల్చి చూస్తారని పోలీసులు చెప్పారు.

శ్రద్ధ శరీరాన్ని ముక్కలుగా నరకటానికి ఉపయోగించినట్లు భావిస్తున్న కత్తుల కోసం దిల్లీ శివారు ప్రాంతమైన గుర్గావ్‌లో కూడా పోలీసులు మెటల్ డిటెక్టర్లతో జల్లెడ పడుతున్నారు. దిల్లీలోని మైదాన్ గఢీ ప్రాంతంలో ఒక చెరువు నుంచి డైవర్లు కొన్ని ఎముకలను వెలికితీశారు. మరిన్ని ఆధారాల కోసం ఆ చెరువు నీటిని తోడి ఖాళీచేశారు.

గురువారం నాడు నిందితుడికి పాలీగ్రాఫ్ పరీక్ష చేశారు. ఆ తర్వాత నార్కో-ఎనాలసిస్ పరీక్ష చేస్తారని భావిస్తున్నారు. ఈ పరీక్షలో భాగంగా నిందితుడి శరీరంలోకి 'ట్రూత్ సీరం’ అని పిలిచే ఒక ఔషధాన్ని ఇంజెక్ట్ చేసి, అతడిని ప్రశ్నిస్తారు.

ఈ పరీక్షలను కోర్టు విచారణలో సమర్పించటానికి వీలులేనప్పటికీ.. అఫ్తాబ్ పరస్పర విరుద్ధమైన వాంగ్మూలాలు ఇస్తూ తమను తప్పుదోవ పట్టిస్తున్నారని పోలీసులు చెప్పటంతో ఈ పరీక్షలు నిర్వహించటానికి జడ్జి అనుమతిచ్చారు.

శ్రద్ధా వాల్కర్ హత్య కేసు

మిస్సింగ్ లింక్స్

ఈ కేసులో 80 శాతం దర్యాప్తు పూర్తయిందని పోలీసులు మంగళవారం నాడు కోర్టుకు చెప్పారు. అయితే కేసును పటిష్టంగా మలచేందుకు ఇంకా కీలక ఆధారాల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

శ్రద్ధ, అఫ్తాబ్‌లు నివసించిన అపార్ట్‌మెంట్‌లో ఆమెకు సంబంధించిన వస్తువులేవీ పోలీసులకు దొరకలేదు. హత్య జరిగి కొన్ని నెలలు గడచిపోవటంతో.. ఆధారాలు కొన్ని మాయమైపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.

శ్రద్ధ శరీరాన్ని ముక్కలుగా కోయటానికి హ్యాక్ సా (మర రంపం) లేదా మాంసం నరికే కత్తి వంటి 'భారీ, పదునైన ఆయుధా’న్ని ఉపయోగించినట్లు పోలీసులు భావిస్తున్నారు. కానీ ఆ ఆయుధమేదీ వారికి ఇంకా దొరకలేదు.

అలాగే పోలీసులకు దొరికిన ఎముకలు బాధితురాలివే అనేది కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. ఆ అస్థికలు హత్య జరిగిన నెలల తర్వాత దొరికాయి కాబట్టి వాటి రూపురేఖలు మారిపోయాయని వార్తలు వచ్చాయి.

ఈ కేసులో పోలీసుల దగ్గర పటిష్టమైన ఆధారాలు లేవని, పూర్తిగా 'పరిస్థితులకు సంబంధించిన సాక్ష్యాధారాల’ మీదే కేసు మొత్తం ఉందని ఇది కోర్టు పరిశీలనలో నిలవదని విమర్శకులు అంటున్నారు.

దీనిపై దిల్లీ పోలీసులను బీబీసీ సంప్రదించింది. అయితే, వారు, ''దర్యాప్తులో బిజీగా ఉన్నాం’’ అని బదులిచ్చారు.

ఈ కేసులో ఆధారాలు పుష్కలంగా ఉన్నాయని, లోతైన దర్యాప్తుతో నిందితుడిని కోర్టులో దోషిగా నిర్ధారింపజేయవచ్చునని మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ పేర్కొన్నారు.

''నేరంలో వాడిన ఆయుధం దొరకటానికి కొన్నిసార్లు సమయం పడుతుంది. కానీ, ఒక రక్తపు చుక్క, ఒక ఉమ్మి మరక, లేదా ఒక మాంసపు తునకో దొరికితే.. పటిష్టమైన కేసును నిర్మించవచ్చు’’ అని ఆయన చెప్పారు.

దానితోపాటు అఫ్తాబ్‌కు వ్యతిరేకంగా, 'పరిస్థితులకు సంబంధించిన ఆధారాలు’ తగినంతగా ఉన్నాయన్నారు. ''వాళ్లు సహజీవనం చేస్తున్నారు. శ్రద్ధ తరచుగా ఆ ఇంటికి వస్తూ పోతూ ఉన్న విషయాన్ని చెబుతున్న పొరుగువాళ్లు ఉన్నారు, చూపుతున్న సీసీటీవీ దృశ్యాలు ఉన్నాయి. కాబట్టి అతడు తప్పించుకోవటానికి ఉన్న దారులు చాలా తక్కువే’’ అని ఆయన వివరించారు.

ఈ కేసు సవాళ్లతో కూడుకున్న కేసు అనేది తనకు తెలుసునని అఫ్తాబ్ తరఫు న్యాయవాది కుమార్ ఒక హిందీ వార్తాపత్రికతో మాట్లాడుతూ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Shraddha Walker, Aftab Poonawala: What is the truth in the sensational news coming on 'fridge murder'?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X