కర్నాటక 24వ సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం-డిప్యూటీగా డీకే శివకుమార్..
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇవాళ కర్నాటక సీఎంగా సీఎల్పీ నేత సిద్ధరామయ్య ప్రమాణం చేశారు. ఆయనకు డిప్యూటీగా పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. వీరితో పాటు పలువురు మంత్రులు ఇవాళ ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వీరితో ప్రమాణం చేయించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం ఇందుకు వేదికైంది.

కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎంలుగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణం చేసిన తర్వాత మంత్రులుగా జి. పరమేశ్వర, ఎంబీ పాటిల్, ప్రియాంక్ ఖర్గే ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ మొత్తం సీఎంతో పాటు 8 మంది మంత్రులు ప్రమాణం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, నేతలు తరలివచ్చారు. దీంతో కంఠీరవ స్టేడియం జనసంద్రంగా మారింది.
మరోవైపు కర్నాటక సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విపక్షాల ఐక్యతకు చిహ్నంగా నిలిచింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, నితీశ్ కుమార్, పలువురు విపక్ష పార్టీల నేతలు తరలివచ్చారు. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వంటి వారికి మాత్రం ఆహ్వానం అందలేదు.
ప్రమాణ స్వీకారానికి హాజరైనవారిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, బిహార్ సీఎం నితీశ్, తమిళనాడు సీఎం స్టాలిన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, కమల్ నాథ్ , సీతారం ఏచూరి, డి.రాజా, తేజస్వీ యాదవ్, మెహబూబా, ముఫ్తీ, శివరాజ్ కుమార్, కమలహాసన్ ఉన్నారు.












Click it and Unblock the Notifications