కరోనాతో అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి కన్నుమూత... యూపీలో ఒక్కరోజే 266 మంది మృతి..
ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ వీరేంద్ర కుమార్ శ్రీవాస్తవ కరోనాతో బుధవారం(ఏప్రిల్ 28) కన్నుమూశారు. అలహాబాద్ హైకోర్టులో లక్నో బెంచ్‌లో ఆయన సిట్టింగ్ జడ్జిగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు.
వీరేంద్ర కుమార్ శ్రీవాస్తవ 1986లో న్యాయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 1988లో పీజీ పూర్తి చేశారు. 2005లో ఉన్నత స్థాయి జ్యుడీషియల్ సర్వీసులోకి వచ్చారు. 2016లో జిల్లా&సెషన్స్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు.నవంబర్ 22,2018లో అలహాబాద్ హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులయ్యారు. నవంబర్ 20,2020లో శాశ్వత జడ్జిగా అపాయింట్ అయ్యారు. డిసెంబర్,2023 వరకు ఆయన సర్వీస్ ఉంది.

ఇటీవల ఇద్దరు ఢిల్లీ కోర్టు జడ్జిలు కరోనా బారిన పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. గత వారం ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు జడ్జి కోవై వేణుగోపాల్ కరోనాతో కన్నుమూశారు. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కమ్రాన్ ఖాన్ మంగళవారం(ఏప్రిల్ 27) కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. వారం రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స పొందిన ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఏప్రిల్ 18న చివరిసారిగా ఆయన ఓ కేసు విచారణ చేపట్టారు.
బుధవారం ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 266 మంది కరోనాతో మృతి చెందారు. ఇందులో అలహాబాద్‌లో 21 మంది,హర్దోయిలో 15 మంది,వారణాసిలో 14 మంది,లక్నో,కాన్పూర్‌లలో 13 మంది,ఘజియాబాద్‌లో 12 మంది చొప్పున కరోనాతో మృత్యువాత పడ్డారు. కొత్తగా మరో 29,824 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,82,848కి చేరింది. రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 11,943కి చేరింది. ఇప్పటివరకూ 8,70,864 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,00,041 యాక్టివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications