కరోనా విలయం: ఊహించని దెబ్బ.. ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ఫెయిల్.. కథ మొదటికొస్తే ఉత్పాతమే..
''టెస్టింగ్.. టెస్టింగ్.. అండ్ టెస్టింగ్.. కరోనా మహమ్మారిని నిలువరించడానికి కేసుల్ని గుర్తించడం కంటే మరో మార్గం లేనేలేదు''అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) పదేపదే సూచించడంతో ప్రపంచ దేశాలన్నీ టెస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేశాయి. జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశమైన భారత్ కూడా అదే బాటలో పయనించింది. వైరస్ వేగంగా విస్తరింస్తుండటం, మన దగ్గర ల్యాబ్ సంఖ్య తక్కువగా ఉండటంతో.. ప్రత్యామ్నాయంగా 'ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్'వైపు ప్రభుత్వాలు మొగ్గుచూపాయి. కానీ వ్యాధిని పసిగట్టడంలో ఆ కిట్స్ ఫెయిలవుతుండటంతో రెండ్రోజుల పాటు వాటిని వాడొద్దని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) రాష్ట్రాలను ఆదేశించింది. దీంతో కిట్స్‌నే నమ్ముకున్న రాష్ట్రాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

మొదటిదే పక్కా..
కొవిడ్-19 వ్యాధి గుర్తింపునకు సంబంధించి ఐసీఎంఆర్ రెండు రకాల టెస్టింగ్ విధానాల్ని అనుమతించింది. మొదటిది ఆర్టీ-పీసీఆర్ RT-PCR (రివర్స్ ట్రాన్స్‌క్రిప్టేస్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్) విధానం. వైరస్ అనుమానితుల నోటి నుంచి లాలాజలాన్ని, పొడి దగ్గు లక్షణాలున్న వ్యక్తుల నుంచి కఫాన్ని సేకరించి ఈ పరీక్షలు నిర్వహిస్తారు. సేకరించిన నమూనాల్లో కరోనా వైరస్ జీనోమ్ ఉందా లేదా అనేది నిర్ధారించి ఫలితాలు వెల్లడిస్తారు. అయితే ఈ పరీక్షల్ని కేవలం ల్యాబ్స్ లో మాత్రమే చేపడతారు. అలాంటి ల్యాబ్స్ ఐసీఎంఆర్ నెట్ వర్క్ పరిధిలోనివి 201, ప్రైవేటు ల్యాబ్స్ 86 మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. ఆర్టీ-పీసీఆర్ విధానంలో ఒక్కో టెస్టుకు కచ్చితమైన ఫలితాలు వచ్చినప్పటికీ, అందుకోసం 10 నుంచి 25 గంటల సమయం పడుతుంది. ఖర్చు కూడా రూ.2500 నుంచి రూ.6వేల దాకా అవుతుంది. దీంతో..

రెండోదానిపై అనుమానాలు..
కరోనా పరీక్షల కోసం ఐసీఎంఆర్ సూచించిన మొదటి విధానం ఆర్టీ-పీసీఆర్ కాగా, రెండోది ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ కిట్స్. అచ్చం రక్త పరీక్షల్ని పోలిన ఈ విధానం ద్వారా మన శరీరంలో యాంటీ బాడీలు ఉన్నాయో లేవో గుర్తిస్తారు. అంటే, ఒక వ్యక్తికి వైరస్ సోకినప్పుడు సహజంగానే యాంటీ బాడీలు విడుదలై, వైరస్ తో పోరాడుతాయి. తద్వారా కరోనా లక్షణాలు బయట పడకముదే వైరస్ ఉందో లేదో ప్రాథమికంగా గుర్తించొచ్చన్నమాట. దీనికి సమయం 10 నుంచి 30 నిమిషాలు పడుతుండటం, ఒక్కో టెస్టింగ్ కిట్ ధర రూ.300 నుంచి రూ.800 వరకు ఉండటంతో ప్రస్తుతానికి చాలా రాష్ట్రాలు ఈ విధానాన్నే ఫాలో అవుతున్నాయి. కానీ దీనిపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

ఒకే శాంపిల్.. రెండు ఫలితాలు..
ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఫెయిల్ అవుతున్నాయన్న విషయాన్ని ముందుగా రాజస్థాన్.. ఐసీఎంఆర్ కు ఫిర్యాదు చేసింది. ర్యాపిడ్ కిట్స్ ద్వారా చేసిన టెస్టుల్లో కేవలం 5.4 శాతం మాత్రమే కచ్చితమైన ఫలితాలు వస్తున్నాయని, 94.6 శాతం ఫలితాలు తప్పుగా వస్తున్నాయని చెప్పింది. దీంతో ఐసీఎంఆర్ సైంటిస్టులు సైతం కొన్ని నమూనాల్ని టెస్టు చేయగా, ర్యాపిడ్ కిట్స్ లో నెగటివ్ గానూ.. ఆర్టీ-పీసీఆర్ విధానంలో పాజిటివ్ గానూ వచ్చాయి. దీంతో అసలు మొత్తానికి మొత్తం కిట్స్ ను వాడొద్దని ఐసీఎంఆర్ రాష్ట్రాలను ఆదేశించింది. రెండు రోజుల్లోగా లోపాలు ఎక్కడున్నాయో కనిపెట్టి, తదుపరి ఆదేశాలు జారీచేస్తామని, అప్పటిదాకా ఎవరూ వాటిని వినియోగించొద్దని చెప్పింది. కాగా,

ఆ రాష్ట్రాల పరిస్థితేంటి?
ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ వాడకాన్ని ఐసీఎంఆర్ నిలిపేయడంతో.. ఇన్నాళ్లూ వాటినే నమ్ముకున్న రాష్ట్రాల్లో ఒకింత గందరగోళం నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు లక్షల సంఖ్యలో ర్యాపిడ్ కిట్స్ ను సౌత్ కొరియా, చైనా నుంచి దిగుమతి చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కారు ఏకంగా 10 లక్షల కిట్స్ కు ఆర్డర్ పెట్టగా, తొలి విడతలో 2 లక్షల కిట్స్ దిగుమతికాగా, వాటితోనే పనికానిస్తోంది. ప్రతిరోజూ 5వేలకు తగ్గకుండా టెస్టింగ్స్ నిర్వహిస్తూ, అనుమానితులుగా భావిస్తోన్న 32వేల మందికి కూడా కిట్స్ తోనే టెస్టులు చేసేందుకు రెడీ అయింది. కానీ ఐసీఎంఆర్ తాజా ఆదేశాలతో పరీక్షలకు బ్రేక్ పడింది. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలోనూ కిట్స్ వాడకం విరివిగా సాగేది. ప్రస్తుతం రాష్ట్రాలన్నీ తిరిగి ఆర్టీ-పీసీఆర్ విధానాన్నే నమ్ముకోవాల్సిన పరిస్థితి.

అదే జరిగితే కష్టం..
రాబోయే రెండు రోజుల్లో ర్యాపిడ్ టెస్టింగ్స్ కిట్స్ వాడొదన్నారుసరే, కానీ ఇప్పటికే ఈ తప్పుడు విధానంలో ‘నెగటివ్'గా తేలినవాళ్ల సంఖ్యను తల్చుకుంటేనే ఒళ్లు జలదరించే పరిస్థితి. వాళ్లంతా క్వారంటైన్ లో కాకుండా ఇళ్లలోనే ఉన్నట్లయితే వైరస్ వ్యాప్తి ఊహించలేనంతగా పెరగడం ఖాయం. కానీ కిట్స్ ఏమేరకు ఫెయిల్ అయ్యాయన్నదాన్ని బట్టే ఉత్పాతం తీవ్రత ఉంటుంది. ఒక బ్యాచ్ లేదా కొన్ని ప్రాంతాలకు సరఫరా అయిన కిట్స్ లోనే లోపాలున్నాయా? లేక పెద్ద సంఖ్యలో ఫెయిల్ అయ్యాయా? అనేది రెండ్రోజుల్లో వెల్లడికానుంది. కరోనా మరణాల్లో టాప్ దేశాల్లో ఒకటిగా ఉన్న స్పెయిన్ లోనూ మొదట్లో టెస్టింగ్ కిట్స్ ఫెయిలైన కారణంగానే కేసుల సంఖ్య భారీగా పెరగడం తెలిసిందే.