ఆదిత్యనాథ్ ఎఫెక్ట్: మోడీ మేక్ ఇన్ ఇండియాపై దెబ్బ
యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం మోడీ మేక్ ఇన్ ఇండియాపై దెబ్బ వేస్తోంది. తోళ్ల పరిశ్రమపై తీవ్రమైన ప్రభావం చూపబోతోంది.
కోల్‌కతా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం.. అక్రమ కబేళాలపై ఝుళిపిస్తున్న కొరడా.. ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్ఠాత్మక పథకం 'మేక్ ఇన్ ఇండియా'కు ప్రతిఘాతంగా మారనున్నది.
గత నెల మూడో వారంలో సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించడమే తరువాయి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌లో అక్రమ కబేళాలపై ఉక్కుపాదం మోపారు.
ఎక్కడికక్కడ కబేళాలను మూసివేస్తున్నారు. ఫలితంగా దేశీయంగా అతిపెద్దదైన తోళ్ల పరిశ్రమకు అవసరమైన ముడి సరుకుకు వనరులు తగ్గిపోతున్నాయి. దేశీయంగా ముడి సరుకు వనరులు తగ్గిపోతే.. తప్పనిసరి పరిస్థితుల్లో విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సిందే.

టాప్ 5లో భారత్
అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే.. భారతీయ తోళ్ల పరిశ్రమ స్టాండర్డ్స్ తక్కువే. దేశీయంగా చాలా చౌక ధరలకే ముడి సరుకు లభిస్తున్నాప్రస్తుతం దేశీయంగా నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల్లో విదేశాల నుంచి తోళ్ల పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు దిగుమతి చేసుకుంటే తడిసి మోపెడవుతుంది మరి. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే అంతర్జాతీయంగా తోళ్ల పరిశ్రమల్లో టాప్ - 5 దేశాల్లో ఒకటిగా భారతదేశం నిలిచింది. కానీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మోపిన ఉక్కుపాదం ప్రభావం 12 బిలియన్ డాలర్ల భారత తోళ్ల పరిశ్రమపై గణనీయ ప్రభావం చూపనున్నది.

ముడి సరుకు సరఫరాపై ప్రతికూల ప్రభావం
జర్మన్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఇండియా ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ లెదర్ ఎక్స్‌పోర్ట్ కన్వీనర్ చైర్మన్ తపన్ నంది మాట్లాడుతూ ‘ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అక్రమ కబేళాలలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న ఉక్కు పాదాన్ని మేం ప్రశ్నించడం లేదు. ముడి సరుకు సరఫరాకు సప్లయి చైన్‌గా మారిన కబేళాల్లో కార్యకలాపాలు నిలిచిపోయినప్పటి నుంచి తోళ్ల పరిశ్రమకు ముడి సరుకు సరఫరా తగ్గిపోతుందని భావిస్తున్నాం' అని తెలిపారు. తోళ్ల పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు సరఫరా చేస్తున్న పంజాబ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతోపాటు ఉత్తరప్రదేశ్ కూడా భారీ వాటానే కలిగి ఉన్నదని తోళ్ల పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

దిగుమతి తప్పదా?
‘కబేళాలపై పూర్తి స్థాయి నిషేధం తోళ్ల పరిశ్రమ ఉత్పత్తిదారులపై పడుతుంది. దీనివల్ల తోళ్ల పరిశ్రమ ఉత్పత్తిదారులు అధిక ధర పెట్టయినా సరే విదేశాల నుంచి ముడి సరుకు దిగుమతిపై మరింతగా ఆధార పడాల్సిందే. దిగుమతులు పెరిగితే భారత తోళ్ల పరిశ్రమ ఉత్పత్తుల ధరలు కూడా తదనుగుణంగానే పెరుగుతాయి. తద్వారా ప్రపంచ మార్కెట్‌లో పోటీ పడలేం. దీని ప్రభావం ‘మేక్ ఇన్ ఇండియా'పై తప్పనిసరిగా పడుతుంది' అని తపన్ నంది చెప్పారు. తోళ్ల పరిశ్రమ ఎగుమతుల మండలి తెలిపిన వివరాల ప్రకారం ప్రతిఏటా భారత్ మూడు బిలియన్ల చదరపు అడుగులు ముడి తోలు తయారుచేస్తుంది.

తోళ్ల పరిశ్రమకు ఆధారం
భారత తోళ్ల పరిశ్రమ అంతా పూర్తిగా 21 శాతం ఆవులు, గేదెలు, 11 శాతం గొర్రెలు, మేకల తోళ్లపైనే ఆధారపడి ఉన్నది. దేశీయంగా ముడి సరుకు సరఫరా తగ్గిపోతే విదేశాలకు తోళ్ల ఉత్పత్తుల ఎగుమతులు తగ్గుతాయి. సుమారు 2000 ట్యాన్నరీల మేరకు సరఫరాలో కొరత ఏర్పడుతుంది. సుమారు ఏడు శాతం సరఫరా తగ్గుతుంది. 2015 - 16 ఆర్థిక సంవత్సరంలో భారత తోళ్ల పరిశ్రమలో ఎగుమతులు 9.86 శాతం తగ్గుముఖం పట్టాయి. 2014 -15లో 6.49 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు సాగితే 2015 - 16లో అది 5.85 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

ఏటా 15 - 20 % దిగుమతులు
ఇండియన్ లెదర్ ప్రొడక్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అధర్ సాహ్ని మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కబేళాలపై ఉక్కుపాదం మోపడం వల్ల ముడి సరుకు సరఫరాపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఇప్పటికిప్పుడే అంచనాకు రావడం తొందరపాటవుతుందన్నారు. అయితే భారీస్థాయిలో ప్రభుత్వ ఉత్తర్వులు అమలవుతున్నప్పుడు సహజంగానే కొంత ఆందోళన వ్యక్తం అవుతుందన్నారు. ప్రతి ఏడాది తోళ్ల పరిశ్రమలో దిగుమతులు 15 - 20 శాతం పెరుగుతూ వస్తుండటం గమనార్హం.

పెరుగుతున్న దిగుమతులు
ఉత్పత్తుల అవసరాలకు అనుగుణంగా దిగుమతులు పెరుగుతున్నాయి. ఒకవేళ ముడి సరుకు కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని ఇండియన్ లెదర్ ప్రొడక్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అధర్ సాహ్ని తెలిపారు. కబేళాలపై నిషేధం కేవలం గోవధపై మాత్రమే కావడంతోపాటు రాజకీయ నిర్ణయమని తపన్ నంది చెప్పారు. ఒకవేళ దిగుమతి చేసుకున్న ముడి సరుకులో గోవు చర్మం ఉంటే దాన్ని రాజకీయ పార్టీలు సున్నితమైన అంశంగా మార్చేస్తాయా? అని అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications