మోడీ చెప్పిన బొమ్మల కథ: ఏపీ ప్రస్తావన: విశాఖ ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, సీవీ రాజు గొప్పదనం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో ఏపీ గురించి ప్రస్తావించారు. బొమ్మల గురించి వివరించారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి బొమ్మలు ఉపయోగపడతాయని అన్నారు. విశాఖపట్నం జిల్లాలోని ప్రఖ్యాత ఏటికొప్పాక బొమ్మల గురించి మోడీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏటికొప్పాక కళాకారుడు సీవీ రాజు గొప్పదనం గురించీ వివరించారు.
Recommended Video
అలాగే- కృష్ణాజిల్లా కొండపల్లి బొమ్మల గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. ప్రపంచం మొత్తం ఆకట్టుకునేలా ఆ బొమ్మలను తయారు చేయగలుగుతున్నారని అన్నారు. దేశంలో పలు బొమ్మల తయారీ క్లస్టర్లు ఉన్నాయని పేర్కొన్నారు. కర్ణాటకలోని రామనగర జిల్లా చెన్నపట్టణ, ఏపీలోని కృష్ణా జిల్లా కొండపల్లి, తమిళనాడులోని తంజావూరు, అస్సాంలోని డుబ్రి, ఉత్తర ప్రదేశ్‌లోని వారణాశిల్లో తయారయ్యే బొమ్మలు ప్రపంచదేశాలను ఆకట్టుకుంటున్నాయని అన్నారు.

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి బొమ్మలు ఉపకరిస్తాయని అన్నారు. దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమల్లో స్టార్టప్‌లను ప్రారంభించడానికి అనేక చర్యలను తీసుకుంటున్నామని ప్రధాని వివరించారు. ఈ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బొమ్మల తయారీలో భారత్‌ను ఓ హబ్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని అమలు చేసిన లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఇంటిపట్టునే ఉంటున్నారని, ఆన్‌లైన్ తరగతులతో పాటు బొమ్మల పట్లా విద్యార్థులు ఆసక్తి ప్రదర్శించారని అన్నారు.
నూతన విద్యా విధానంలో బొమ్మల తయారీ, వాటితో ఆడుకోవడం వంటి అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చామని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా బొమ్మల పరిశ్రమ ద్వారా ఏడు లక్షల కోట్ల రూపాయల మేర వ్యాపార కార్యకలాపాలు నడుస్తున్నాయని మోడీ చెప్పారు. అదే సమయంలో భారత వాటా నామమాత్రంగా ఉందని, దీన్ని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. చిన్నపిల్లల్లోని సృజనాత్మకతను వెలికి తీసేలా నూతన విద్యావిధానాన్ని రూపొందించామని ప్రధాని ఈ సందర్భంగా పునరుద్ధాటించారు.












Click it and Unblock the Notifications