రాజకీయాలకు సోనియాగాంధీ గుడ్ బై...?
భారత్ జోడో యాత్రతో తన రాజకీయ ఇన్నింగ్స్ ముగిసినందుకు సంతోషంగా ఉందని సోనియా పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ.. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన పార్టీ.. అంతేకాదు స్వాతంత్ర్యం అనంతరం దేశం ముందడుగు వేయడానికి రాజకీయంగా ఎన్నికల్లో నిలిచి ప్రభుత్వాలను ఏర్పాటుచేసి అభివృద్ధి పథంలో పయనింపచేసింది. అటువంటి కాంగ్రెస్ పార్టీని రెండు దశాబ్దాలపాటు ముందుండి నడిపించిన ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.

ప్రజలు సామరస్యం కోరుకుంటున్నారు
త్వరలోనే తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భారత్ జోడో యాత్రతో తన రాజకీయ ఇన్నింగ్స్ ముగిసినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ జోడో యాత్ర పార్టీకి టర్నింగ్ పాయింట్ అవుతుందన్నారు. చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో మూడురోజులపాటు జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి హాజరైన 1500 మంది ప్రతినిధులను ఉద్దేశించి సోనియా మాట్లాడారు. ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ అయ్యిందన్నారు. దేశ ప్రజలు సహనం, సమానత్వం, సామరస్యం కోరుకుంటున్నారని భారత్ జోడో యాత్రద్వారా రుజువైందన్నారు.
ఎన్నికలను ఎదుర్కోవడానికి శ్రేణులంతా సిద్ధంగా ఉండాలి
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో పార్టీ వచ్చే ఎన్నికలను ఎదుర్కోబోతోందని, పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
సోనియాగాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ కూటమిని ఏర్పాటు చేసింది. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో సోనియాగాంధీ తనదైన శైలిలో వ్యవహరించారు. కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో తరుచుగా ముఖ్యమంత్రులను మార్చే పద్ధతికి స్వస్తి పలికి వారికి స్వేచ్ఛగా పాలన చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.
ఆధార్ తీసుకురావడంలో కీలకపాత్ర
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వంటి కీలకమైన పథకాలను సోనియా తీసుకువచ్చారు. అంతేకాకుండా ఆధార్ వ్యవస్థను కూడా తీసుకురావడంలో సోనియాగాంధీది కీలకపాత్ర.2004, 2009 సంవత్సరాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన యూపీఏలో సోనియాగాంధీ ప్రత్యక్ష పాత్ర పోషించలేదు. అన్నీ తానై వెనకుండి నడిపించారు. ఇతర పార్టీలను కలుపుకొని యూపీఏ సర్కారును సమర్థవంతంగా పదేళ్లపాటు పాలించేలా వ్యూహ రచన చేసిన ఘనత కూడా సోనియాకు దక్కుతుంది.












Click it and Unblock the Notifications