
రాజీనామా చేయండి.. 5 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లకు సోనియా గాంధీ ఆదేశం
5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. 4 రాష్ట్రాల్లో తిరిగి కమలమే వికసించింది. ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేకపోయింది. దీంతో ఆ పార్టీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో.. రాజీనామాస్త్రాన్ని సోనియా ప్రయోగించారు. కానీ సభ్యులు తిరస్కరించడంతో.. సోనియానే కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు 5 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌ల గురించి సోనియా ఫోకస్ చేశారు.
పార్టీని పటిష్ఠపరిచే పనికి కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. ఓటమిపై పోస్టుమార్టం పేరుతో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తాజాగా మంగళవారం సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ముగిసిన 5 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్‌కు చెందిన పార్టీ శాఖల చీఫ్‌లు తక్షణమే తమ పదవులకు రాజీనామాలు చేయాలని సోనియా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన 5 రాష్ట్రాల రాష్ట్ర శాఖలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉన్నందున పీసీసీ పదవులకు రాజీనామాలు చేయాలని ఆదేశించారు.

పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధు ఇప్పటికే రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో మార్పుల కోసం ముఖ్యంగా కేంద్ర, రాష్ట్రాల్లో నాయకత్వ మార్పు కోసం కొందరు సీనియర్లు పట్టుబడుతున్న తరుణంలో సోనియా నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. మిగిలిన నేతలు కూడా రాజీనామా చేయాల్సి వస్తోంది. మరోవైపు గాంధీలపై వ్యతిరేక గళం వినిపిస్తోంది. ఇవాళ రాహుల్ గాంధీ గురించి కపిల్ సిబాల్ కామెంట్ చేశారు. ఆయన అధ్యక్షుడు కారు.. కానీ అన్నీ నిర్ణయాలు తీసుకుంటారు అని మాట్లాడారు.
గాంధీ నాయకత్వంపై కొందరు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. అందుకోసమే వారు రాజీనామాస్త్రం ప్రకటించారు. కానీ కొందరు మాత్రం వీడాల్సిందేనని అంటున్నారు. ఈ క్రమంలో పీసీసీ చీఫ్‌లకు సంబంధించి సోనియా కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని సంస్థాగతంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.