నన్ను దేవతను చేయొద్దు: టీ నేతలతో సోనియా గాంధీ
న్యూఢిల్లీ: తెలంగాణ ఇచ్చినందుకు తనను ప్రశంసలతో ముంచెత్తడానికి తెలంగాణ నేతలు చేసిన ప్రయత్నాలను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వారించారు. తనను దేవతను చేయవద్దని సూచించారు. అందరూ కలిసి మెలిసి జీవించాలని ఆమె చెప్పారు. సీమాంద్ర ప్రజలు బాధలో ఉన్నారని, వారు ఏమన్నా బాధపడవద్దని, వారిని అర్థం చేసుకోవాలని, ఇరు ప్రాంతాలవారు కలిసి మెలసి అభివృద్ధి చెందాలని ఆమె అన్నారు. తనను కలిసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు ఆ పార్టీ సోనియా గాంధీ హితబోధ చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర తాజా మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ సంఘాల చైర్మన్లు, పార్టీ నాయకులతో పాటు మొత్తం 70 మంది బృందంగా వెళ్లి శుక్రవారం సాయంత్రం సోనియాను ఆమె నివాసంలో కలిశారు. ఆరు దశాబ్దాల కోరికను నెరవేర్చారంటూ సోనియాకు జానారెడ్డి, డి.శ్రీనివాస్, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.

కృతజ్ఞతలు తెలిపేందుకుగాను హైదరాబాద్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, దానికి హాజరు కావాలని ఆహ్వానించారు. అందుకు సోనియా అంగీకరించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌తో మాట్లాడి తేదీ ఖరారు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే లోపు వస్తే బాగుంటుందని నాయకులు ఆమెకు సూచించారు.
ఆ తర్వాత తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు ఎపి భవన్‌కు చేరుకుని మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో ప్రజలందరినీ కలిసేందుకు తాను వస్తానని సోనియా తమకు హామీ ఇచ్చారని జానారెడ్డి వెల్లడించారు. మార్చి మొదటి వారంలో హైదరాబాద్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పార్టీ పెద్దలందరినీ కలిసిన తర్వాత ఆదివారం హైదరాబాద్‌కు తిరిగి వెళతామని, నేరుగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి ఆ తర్వాత గాంధీ భవన్‌లో కార్యకర్తలతో సమావేశం అవుతామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు పెట్టని కోటలాగా తయారు చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications