సోనియా గాంధీ ఎడిటోరియల్ ఒపీనియన్- కేంద్రాన్ని ఏకిపారేశారు.. !!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న పరీక్షాపత్రాల లీకేజీ వివాదం, వాటి నిర్వహణలో వైఫల్యాలపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో శాంతియుతంగా నిరసనలు తెలుపుతోన్న విద్యార్థులపై లాఠీ ఛార్జీ చేయడాన్ని తప్పు పట్టారు. కేంద్రం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోందని, వారిని అణచివేస్తోందని ఆరోపించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన యువతను శత్రువులుగా పరిగణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ది హిందూ లో ప్రత్యేకంగా ఎడిటోరియల్ ఒపీనియన్ రాశారు. తన అభిప్రాయాలన్నింటినీ ఇందులో పొందుపర్చారు. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది లాఠీఛార్జీ, భాష్పాయువు గోళాల ప్రయోగం వంటి చర్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఘటనను విద్యారంగ చరిత్రలోనే ఓ బ్లాక్ డేగా సోనియా గాంధీ అభివర్ణించారు.

విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీలు ఝళిపించారని, ఈ దాడిలో ఎంతో మంది గాయపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు మొదలుకుని సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు.. చివరికి విద్యార్థులపై కూడా హింసనే ప్రయోగిస్తోందని సోనియా గాంధీ విమర్శించారు. ప్రభుత్వం తన నిరంకుశ పాలనతో సమస్య సున్నితత్వాన్ని కూడా అర్థం చేసుకోలేని రీతిలో ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు.
యువత శరీరాలపై పడిన గాయాలు, పెల్లెట్ తూటాలు దీనికి నిదర్శనమని, ఇటువంటి వైఖరి మానవత్వం అనిపించుకోదని ఆమె చురకలు అంటించారు. అవన్నీ కూడా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అనుమతితోనే జరిగాయని చెప్పడంలో సందేహాలు అక్కర్లేదని వ్యాఖ్యానించారు. ఈ అణచివేత చర్యల ద్వారా విద్యార్థుల గొంతు నొక్కాలని చూడటం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు.
కేంద్రం ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తోందని సోనియా గాంధీ ఆరోపించారు. ఈ క్రమంలో బడ్జెట్ కేటాయింపులను ప్రస్తావించారు. పాఠశాల విద్యా బడ్జెట్‌లో 50 శాతం, ఉన్నత విద్యలో 33 శాతం మేర నిధులను తగ్గించడాన్ని ఉదాహరించారు. గత 12 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు లక్ష ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని, ఫలితంగా 43,000 ప్రైవేట్ స్కూళ్ల స్థాపనకు ప్రభుత్వం పరోక్షంగా సహకరించిందని ఆమె ఆరోపించారు.
యూనివర్శిటీలకు ఇచ్చే నిధులు, గ్రాంట్లను యూజీసీ క్రమంగా నిలిపివేస్తోందని, దీనికి ప్రత్యామ్నాయంగా ఆయా విశ్వవిద్యాలయాలు భారీ వడ్డీ రేట్లతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని కేంద్రం ఒత్తిడి తెస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రుణాలను తిరిగి చెల్లించడానికి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు తమ ఫీజులను విపరీతంగా పెంచవలసి వస్తోందని ఆమె పేర్కొన్నారు. దీనివల్ల మధ్యతరగతి, పేద కుటుంబాలు తమ పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజుల రూపంలో భారీగా అప్పులపాలు కావాల్సి వస్తోందని మండిపడ్డారు.
రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాలు తమ సొంత అవసరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించుకునే ప్రవేశ పరీక్షల విధానాన్ని రద్దు చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. దానికి బదులుగా ఎన్టీఏ ఆధ్వర్యంలో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ వంటి కేంద్రీకృత పరీక్షా విధానాన్ని తీసుకురావడం వల్ల విద్యార్థులపై భారం పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఎన్టీఏలో కనీస సిబ్బంది లేరని, అదొక బలహీనమైన సంస్థ అని చెప్పారు. ప్రైవేట్ కాంట్రాక్టర్లపై ఆధారపడి దేశవ్యాప్త పరీక్షలను నడుపుతోందని ధ్వజమెత్తారు.
గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా వివిధ పరీక్షలకు సంబంధించి దాదాపు 152 పరీక్షాపత్రాల లీకేజీలు జరిగాయని సోనియా గాంధీ గుర్తుచేశారు. ముఖ్యంగా 2017లో ఎన్టీఏ ఏర్పాటైనప్పటి నుంచి తొమ్మిది సార్లు జాతీయ స్థాయి పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని వివరించారు. జాతీయ విద్యా విధానాన్ని పార్లమెంట్‌లో ఎలాంటి తగిన చర్చలు జరపకుండానే ఏకపక్షంగా అమలు చేశారని, ఎన్టీఏను పటిష్టం చేయడానికి పార్లమెంటరీ స్థాయి సంఘం ఇచ్చిన సిఫార్సులను కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి తిరస్కరించారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications