నేడు ఈడీ విచారణకు సోనియా - పార్టీ నేతల పాదయాత్ర : నిరసనలు..!!
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా నేడు ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్-ఏజేఎల్ వ్యవహారానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. గత నెలలోనే ఈ నోటీసులు జారీ అయినా... సోనియా కరోనా బారిన పడటంతో హాజరు మినహాయింపు కోరారు. అదే సమయంలో పార్టీ నేత రాహుల్ గాంధీకి సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. అయిదు సార్లు ఈడీ పార్టీ నేత రాహుల్ ను విచారించింది. కేంద్ర ప్రభుత్వం విచారణ సంస్థల ద్వారా రాజకీయ వేధింపులకు దిగుతోందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

నేషనల్ హెరాల్డ్–ఏజేఎల్ వ్యవహారంలో
రాహుల్ ను ఈడీ దాదాపు 50 గంటల పాటు విచారించింది. ఆ విచారణ సమయంలో అటు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో..రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. పోలీసులు వారిని నియంత్రించేందుకు చేపట్టిన చర్యల పైన ఆరోపణలు వెల్లువెత్తాయి. కరోనా కారణంగా తాను విచారణకు రాలేనంటూ గతంలో సోనియా కోరటంతో ఈ రోజున విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు పంపింది. అందులో భాగంగా.. ఈ ఉదయం 11 గంటలకు సోనియా ఈడీ కార్యాలయానికి రానున్నారు. సోనియా ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కానున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది.

నిరసనలకు కాంగ్రెస్ నిర్ణయం
సోనియా ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కానున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం ఈడీ నడుచుకుంటోందని, ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనిగా పెట్టుకుందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం పట్ల పార్టీపరంగా ఎలా స్పందించాలన్న దానిపై వ్యూహాన్ని ఖరారు చేయడానికి ఎంపీ మల్లికార్జున ఖర్గే నివాసంలో నేతలు సమావేశమయ్యారు. సోనియా గాంధీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. పార్టీ ఎంపీలు, నేతలు కాంగ్రెస్ కార్యాలయం చేరుకోనున్నారు. అక్కడ నుంచి ఈడీ ఆఫీసు దాకా పాదయాత్ర చేయనున్నారు.

పార్టీ నేతల పాదయాత్ర
అలాగే రాజ్‌భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రాహుల్ విచారణ సమయంలో ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చారు. ఆ సమయంలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ముఖ్య నేతలను అరెస్ట్ చేసారు. అయితే, ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో సోనియా విచారణ - కాంగ్రెస్ నిరసనలకు పిలుపునివ్వటంతో అటు పార్లమెంట్ లో..ఇటు బయటా కాంగ్రెస్ దీని పైన కేంద్రాన్ని ప్రశ్నిస్తూ నిరసనలు తీవ్ర తరం చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications