అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న సోనూ సూద్ సోదరి మాళవిక: పార్టీపై నో క్లారిటీ
ఛండీగఢ్: కరోనావైరస్ కష్టకాలంలోనే గాక, తమకు సాయం కావాలని కోరిన అనేక మందిని ఆదుకుని రీల్ హీరో నుంచి రియల్ హీరోగా మారిన సోనూ సూద్ ఆదివారం ఓ కీలక ప్రకటన చేశారు. తన సోదరి మాళవిక సూద్ రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సోనూ సూద్ ప్రకటించారు. అయితే, ఆమె ఏ పార్టీ నుంచి పోటీ చేయనుందనే విషయం మాత్రం వెల్లడించలేదు.

తన సోదరి ఎన్నికల్లో పోటీ చేస్తోందంటూ సోనూ సూద్ ప్రకటన
మోగాలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో సోనూ సూద్ ఈ కీలక ప్రకటన చేశారు. మాళవిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆమె నిబద్ధత సాటిలేనిది. రాజకీయ పార్టీలో చేరాలనుకోవడం జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయం . కేవలం సాధారణ సమావేశాలు మాత్రమే కాదు. ఇది పూర్తిగా సిద్ధాంతాలతో ముడిపడిన అంశం. ఏ పార్టీలో చేరనున్నారనేది సరైన సమయలో ప్రకటిస్తామని సోనూ సూద్ తెలిపారు.

ఇప్పటికే పంజాబ్ సీఎం, ఢిల్లీ సీఎంలను కలిసిన సోనూ సూద్
కాగా, సోనూ సూద్ ఆయన సోదరి మాళవికతో కలిసి ఇటీవలే పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ చన్నీని కలిశారు. గతంలో సోనూ సూద్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోనూ ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. అంతేగాక, ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన దేశ్ కా మెంటార్స్ అనే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గానూ సోనూ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమలో ఆయన సోదరి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేస్తారా? లేక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారా? అనేది త్వరలోనే తేలిపోయే అవకాశం ఉంది. అయితే, తనను రాజకీయ నాయకులు, పార్టీలు సన్మానించినప్పటికీ, తన స్వచ్ఛంద సంస్థకు రాజకీయాలతో సంబంధం లేదని సోనూసూద్ ఇప్పటికే వెల్లడించారు. తాజాగా ఎన్నికల్లో ఆయన తన కుటుంబసభ్యులను బరిలోకి దింపడం చర్చనీయాంశంగా మారింది.

సీ-ఓటర్ సర్వే: పంజాబ్‌లో కాంగ్రెస్-ఆప్ మధ్య హోరా హోరీ
వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుందని సీఓటర్ సర్వే స్పస్టం చేసింది. బీజేపీ, దాని భాగస్వామ్ పార్టీలు ఒక్క సీటు కూడా దక్కించుకునే అవకాశం లేదని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ 46 సీట్లు, ఎస్ఏడీ 20, ఏఏపీ(ఆప్)కి 51 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి 34.9 శాతం ఓట్లు, ఎస్ఏడీకి 20.6 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 36.5 శాతం ఓట్లు, బీజేపీకి 2.2 శాతం ఓట్లు రానున్నాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి 42-50 మధ్య, ఆమ్ ఆద్మీ పార్టీకి 47-53 మధ్య సీట్లు రానున్నాయని అంచనా వేసింది. ఈసారి ఎన్నికల్లో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ తన కొత్త పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోటీ చేస్తున్నారు. బీజేపీతోపాటు కలిసివచ్చే ఇతర పార్టీలను కలుపుకుని పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.












Click it and Unblock the Notifications