
ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమం: ఆస్పత్రిలో చేరిక
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో వెంటనే ఆయనను ఆదివారం గుర్గావ్‌లోని మెదాంత ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)కి తరలించారు.
82 ఏళ్ల ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ సీఎంను ఆదివారం ఉదయం ఐసీయూకి తరలించారు. చికిత్స ఇంకా కొనసాగుతోంది.

ములాయం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్చారని, అతని వైద్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇంటర్నల్ మెడిసిన్‌లో నిపుణుడైన డాక్టర్ సుశీలా కటారియా ప్రస్తుతం అతనిని పర్యవేక్షిస్తున్నారని ఇండియా టుడే పేర్కొంది.
ములాయం అనేక రకాల వయస్సు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, వాటిలో అత్యంత తీవ్రమైనది మూత్రనాళ ఇన్ఫెక్షన్ అని వైద్యులు తెలిపారు. ఈ వార్తల నేపథ్యంలో, సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ములాయం పెద్ద కుమారుడు అఖిలేష్ యాదవ్ ఆస్పత్రికి బయల్దేరి వెళ్లినట్లు తెలిసింది.
కాగా, ములాయం వరుసగా మూడు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. భారత ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ప్రస్తుతం మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. నేతాజీ అని పిలవబడే ములాయం యాదవ్.. 1967లో ఉత్తరప్రదేశ్ శాసనసభలో శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.