భయపడుతున్నారు: స్పీకర్ సుమిత్రకు కోపం తెప్పించిన ఎంపీ
న్యూఢిల్లీ: ఓ ఎంపీ వ్యాఖ్యలు లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు కోపం తెప్పించాయి. భారతీయ జనతా పార్టీ ఎంపీ, లోకసభ చీఫ్ విప్ అర్జున్ రాం మెఘ్వాల్.. మహిళలను కించపరుస్తూ సభలో మాట్లాడటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి మాటలు మాట్లాడొద్దని గట్టిగా మందలించారు.
భారత యుద్ధ విమానాలను నడిపేందుకు మహిళలు భయపడుతున్నారని, మిగ్ 21ఎస్ విమానాల్లో పనిచేసేందుకు వెనుకాడుతున్నారని అన్నారు. అంతేగాక, అంతతొందరగా ఎవరూ ముందుకు రావడం లేదని, ఎందుకంటే వీటిల్లో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ కలగజేసుకుని అలాంటి మాటలు వాడొద్దని అన్నారు. వెంటనే 'మీరైతే అంగీకరిస్తారా' అంటూ ఆమె రక్షణశాఖ మంత్రి పారికర్‌ను ప్రశ్నించారు. అందుకు అంగీకరించను అని పారికర్ సమాధానమిచ్చారు.
ఆ తర్వాత అర్జున్ రాం మెఘ్వాల్ వివరణ ఇచ్చుకున్నారు. తాను కేవలం మహిళల్లో అవగాహన కల్పించాలని, ఎన్సీసీ ద్వారా ఆ అవకాశం కల్పించాలని చెప్పాలన్నదే తన ఉద్దేశం తప్ప.. తక్కువ చేసి మాట్లాడటం కాదని తెలిపారు.












Click it and Unblock the Notifications