సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి: ప్రధానికి సోనియా లేఖ
న్యూఢిల్లీ: సీమాంధ్రకు పదివేల కోట్ల రూపాయల ప్యాకేజీని బడ్జెట్‌లో పెట్టాలని బిజెపి పట్టుబడుతున్న నేపథ్యంలో సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించాలని కోరుతూ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని ప్రధాని మన్మోహన్ సింగ్‌ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ, సీఎన్ఎన్-ఐబీఎన్ వార్తా సంస్థలు వెల్లడించాయి.
సీమాంధ్ర ప్రాంతానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని ఆమె సూచించినట్లు తెలిపింది. తెలంగాణ విషయంలో సోనియా పట్టుదలగా వ్యవహరించినట్లు ప్రజల్లోకి గట్టి సంకేతాలు వెళ్లిన నేపథ్యంలో సీమాంధ్ర ప్రయోజనాలపై ఆమె దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

సీమాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని పట్టుబడుతూ బిజెపి సీనియర్ నేతలు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడుతో మంగళవారం ప్రధాని సహా కాంగ్రెస్ కీలక నేతలు భేటీ అయిన నేపథ్యంలో కూడా సోనియా ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తే సీమాంధ్రకు కేంద్రం నుంచి నిధులు దండిగా వస్తాయి.
అయితే ఇదంతా రాజకీయ డ్రామా అని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. మరోవైపు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు లేదా విలీనానికి అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయని కాంగ్రెస్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications