హైదరాబాద్-అయోధ్య విమానాలకు ఆదరణ కరవు-స్పైస్ జెట్ కీలక నిర్ణయం..!
అయోధ్యలో రామాలయం ప్రారంభం తర్వాత భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి విమానయాన సంస్థలు విమానాలను ప్రారంభించాయి. ఎన్నికలకు ముందు ఆలయ నిర్మాణం, అనంతర పరిణామాల్లో బీజేపీ నేతలు చేసిన హడావిడి కారణంగా అయోధ్యకు వెళ్లే భక్తుల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో భారీ ఎత్తున దీన్ని తమ ప్రయోజనాల కోసం వాడుకోవాలని భావించిన ప్రైవేటు విమానయాన సంస్థలకు షాకులు తప్పడం లేదు.
ఇదే క్రమంలో హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా వెళ్లే విమాన సర్వీసుల్ని స్పైస్ జెట్ కూడా ఈ మధ్యే ప్రారంభించింది. అయితే ప్రారంభించిన రెండు నెలల్లోపే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీనికి కారణం అయోధ్యకు ప్రయాణికుల డిమాండ్ పేలవంగా ఉండటమే. అయోధ్యకు రెగ్యులర్ గా వెళ్లే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటం, భారీ టికెట్ రేట్ల కారణంగా సర్వీసులు తగ్గించుకోవాల్సి రావడంతో స్పైస్ జెట్ ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు తాజాగా స్పైస్ జెట్ ప్రకటించింది.

ఏప్రిల్ 2న హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా వెళ్లే విమానాలను ప్రారంభించిన స్పైస్ జెట్ సంస్థ ప్రయాణికుల నుంచి ఎదురైన షాకులతో జూన్ 1 కల్లా తమ నిర్ణయం వెనక్కి తీసుకుంది. అంటే కనీసం రెండు నెలలు కూడా పూర్తిగా అయోధ్యకు హైదరాబాద్ నుంచి విమానాలు నడపలేని పరిస్ధితి ఎదురైంది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లాలంటే ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంది. ఇలా వెళ్లాలంటే ప్రయాణసమయం 7 గంటల 25 నిమిషాలు పడుతోంది. దీంతో అంత సమయం విమాన ప్రయాణం చేసేందుకు ప్రయాణికులు ఇష్టపడటం లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications