శ్రీనగర్ ఉప ఎన్నిక హింస: స్టోన్ పెల్టర్ల వెనుక ఐఎస్ఐ?
శ్రీనగర్: హురియత్ కాన్ఫరెన్స్ 1990 నుంచి హురియత్ కాన్ఫరెన్స్ వంటి వేర్పాటు వాద సంస్థలు ప్రతి ఎన్నికల సమయంలో 'బహిష్కరణాస్త్రం' ప్రయోగిస్తూ వచ్చాయి. కానీ ఈ దఫా బహిష్కరణ పిలుపునకు బదులు భౌతిక దాడులకు దిగారని మిలటరీ నిఘా అధికారులు చెప్తున్నారు.
ఈ నెల తొమ్మిదో తేదీన శ్రీనగర్ లోక్‌సభ స్థాన ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా జరిగిన హింస వెనుక పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ 'ఐఎస్ఐ' పాత్ర ఉన్నదని ఉన్నతాధికారులకు మిలటరీ నిఘా అధికారులు నివేదించారని సమాచారం. ఎన్నికల బహిష్కరణకు బదులు అంతరాయం కలిగించడమే ఈ హింసాత్మక ఘటనలు పంపిన సందేశమని ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల తొమ్మిదో తేదీన శ్రీనగర్‌లోని పోలింగ్ కేంద్రాలపై అల్లరి మూకలు రాళ్లు విసురుతూ ముందుకు సాగితే వారి మధ్య సమన్వయం పెంపొందించిందీ ఐఎస్ఐ ఏజెంట్లేనని మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొనట్లు సమాచారం.ఫలితంగా శ్రీనగర్ లోక్‌సభ స్థాన పరిధిలో జరిగిన పోలింగ్‌లో జమ్ముకశ్మీర్ రాష్ట్ర చరిత్రలోనే అతి తక్కువ ఓటింగ్ నమోదైంది. ఈ హింసలో ఎనిమిది మంది పౌరులు మరణించగా, 100 మందికిపై భద్రతా జవాన్లు గాయపడ్డారు.

స్థానిక యువతను రెచ్చగొడ్తున్న వైనం
సరిహద్దు పొడవునా హింసాత్మక ప్రక్రియ కొనసాగినట్లు ఆర్మీ గుర్తించింది. దీనికి ఐఎస్ఐతోపాటు పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపుల నెట్వర్క్ సహకరించిందని తెలుస్తున్నది. శ్రీనగర్ లోక్ సభా నియోజకవర్గ పరిధిలో హింసాత్మక చర్యల నేపథ్యంలో అనంతనాగ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చేనెల 25వ తేదీకి వాయిదా పడింది. వేర్పాటు వాద సంస్థలు, ఉగ్రవాద గ్రూపుల ఎజెంట్లు హురియత్ కాన్ఫరెన్స్ పేరుతో విధ్వంసానికి దిగారని మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చేశాయి.
కశ్మీర్ లోయలో కార్యకలపాలు నిర్వహిస్తున్న ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థల నాయకత్వం స్థానిక యువతలో విస్తరిస్తోందని, తద్వారా ప్రజల్లో పట్టు సంపాదిస్తోందని అధికారులు చెప్తున్నారు. ప్రధాన రాజకీయాలను ప్రభావితం చేయగలరని తేలిపోయిందని మిలిటరీ ఇంటెలిజెన్స్అధికారులు అంటున్నారు.
గతేడాది కాల్పుల్లో మరణించిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ వారసుడు జకీర్ రషీద్ భట్ అలియాస్ మూసా.. శ్రీనగర్ లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. ఆర్మీ అంచనాల ప్రకారం మూడు ఉగ్రవాద సంస్థలకు చెందిన 140 - 150 మంది ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నారని తెలుస్తున్నది. వీరిలో పాకిస్థాన్ వాసులైన లష్కర్ ఈ తొయిబాకు చెందిన 60 మంది ఉగ్రవాదులు, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన 40 - 50 మంది మిలిటెంట్లు, మిగతా వారు జైష్ ఇ మహ్మద్ ఉగ్రవాదులని ఆర్మీ అధికారులు అంటున్నారు.

పీడీపీ కార్యకర్త, కార్మిక నేతలతో భారత్ వ్యతిరేక నినాదాలు
పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఓటు వేయకుండా ఉండ నిరాకరించిన వారిని వేర్పాటువాదులు ఇష్టారాజ్యంగా తీవ్రంగా కొట్టారని తెలుస్తోంది. గన్ పాయింట్‌లో ప్రాణాలకు భయపడి ఒక పీడీపీ కార్యకర్త, మరొక వ్యాపారిలతో బారత్ వ్యతిరేక నినాదాలు చేయించిన రెండు ఫ్రెష్ వీడియోలు కశ్మీర్ లోయ అంతటా హల్‌చల్ చేస్తున్నాయి. అధికార పీడీపీ కార్యకర్త వలీ మహ్మద్ భట్ గతంలో చేసిన తప్పిదాలకు క్షమాపణ చెప్తున్నట్లు ఆ వీడియోలో ఒకటి.
సదరు కార్యకర్తపై ‘ఎకె 47' రైఫిల్ ప్రయోగిస్తుండగా, సదరు పీడీపీ వర్కర్ వలీ మహ్మద్ భట్.. పీడీపీతో తన అనుబంధాన్ని ఉపసంహరించుకున్నట్లు సదరు వీడియోలో ప్రకటించినట్లు ఉంది. అంతే కాదు భారత్ వ్యతిరేక నినాదాలు కూడా చేసినట్లు వీడియో పేర్కొంటున్నది. అయితే సదరు వీడియోలో తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి మాత్రం కనిపించడంలేదు.
బషీర్ అహ్మద్ వనీ అనే కార్మిక నాయకుడిపై చిత్రీకరించిన మరో వీడియోలో సదరు నాయకుడు అన్ని ప్రజాతంత్ర కార్యక్రమాలకు దూరమవుతున్నట్లు పేర్కొనడంతోపాటు బల ప్రయోగం కారణంగా భారత వ్యతిరేక నినాదాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. పోలింగ్ తేదీ నాడు శ్రీనగర్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో నిరసనకారులు గుంపులుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తున్నది. అంతటితో ఆగకుండా అల్లరిమూకలు ఒక పోలింగ్ కేంద్రానికి నిప్పంటించి, స్థానికుల్లో భయోత్పాతం కలిగించేందుకు కూడా వెనుకాడలేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

ముసుగుతో యువత దాడులు ఇలా
కశ్మీర్ లోయలో అల్లర్లు చెలరేగినప్పుడల్లా మెరికల్లాంటి కుర్రవాళ్లు వీధుల్లోకి వచ్చి పోలీసులు, సైనికులు, ప్రభుత్వ అధికారులపైకి రాళ్లు రువ్వి, వాహనాలు దగ్ధంచేసి, దుకాణాలకు నిప్పంటిస్తుండటం, కొన్నిసార్లు పెట్రోలు బాంబులు విసురుతూ బీభత్సం సష్టించడం కూడా తెల్సిందే. కాస్త జాగ్రత్తగా గమనిస్తే కుర్రాళ్లు తమను గుర్తు పట్టకుండా ముఖాలకు ముసుగులు ధరించడం గానీ, కళ్ల కిందుగా ముఖాలకు కర్చీఫ్‌లు కట్టుకోవడం, పరుగెత్తడానికి అనువుగా కాళ్లుకు తెల్లటి స్పోర్ట్స్ షూలను ధరించడం కనిపిస్తుంది.

ప్రభుత్వ వ్యతిరేకత కూడా కారణమేనా?
నిరుద్యోగంతో రగిలిపోతున్న యువత ప్రభుత్వం మీద వ్యతిరేకతో ఇలా పెడదారి పట్టి పోతోందని సామాజిక శాస్త్రవేత్తలు ఇంతకాలం సూత్రీకరిస్తూ వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇటీవలి తన కశ్మీర్ పర్యటనలో స్థానిక యువతను ఉద్దేశించి మాట్లాడుతూ పర్యాటకాన్ని ఎంచుకుంటారా, ఉగ్రవాదాన్ని ఎంచుకుంటారా? అని కూడా ప్రశ్నించారు. రాళ్లు రువ్వుతున్నది నిరుద్యోగ యువతేగానీ ప్రభుత్వం మీద ఆగ్రహంతోనే ఆక్రోశంతోనో వాళ్లు రాళ్లు రువ్వడంలేదు. కశ్మీరీ యువకులు కేవలం డబ్బుల కోసం వారు రాళ్లు రువ్వుతున్నారు. రాళ్లు రువ్వినందుకు వారికి నెలకు ఒక్కొక్కరికి రూ. 5,000 నుంచి రూ. 8,000 జీతంగా వస్తాయట. పెట్రోలు బాంబులు తయారు చేయడానికి, వాటిని విసిరినందుకు అదనపు చార్జీలు అందుతాయని ఓ టీవీ చానెల్ నిర్వహించిన ఆపరేషన్‌లో జకీర్ అహ్మద్ భట్, ఫరూక్ అహ్మద్ లోన్, వసీం అహ్మద్ ఖాన్, ముస్తాక్ వీరి, ఇబ్రహీం ఖాన్ అనే కుర్రాళ్లు చెప్పారు.

పెట్రోల్ బాంబులు విసిరితే అదనపు చెల్లింపులు
2008, 2010ల్లోనూ కశ్మీర్‌లో పెద్ద ఎత్తున రాళ్లు రువ్వి బీభత్సం సష్టించిన ఘటనల్లో తాను పొల్గొన్నానని, గతేడాది బుర్హాన్ వనీ మిలిటెంట్ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో కూడా తాను రాళ్లు రువ్వానని జకీర్ అహ్మద్ భట్ తెలిపారు. రాళ్లు రువ్వినందుకు తనకు నెలకు రూ. 8000 వరకు అందుతాయని, తాను పెట్రోలు బాంబులు కూడా తయారు చేస్తానని, అందుకు ఒక్కోదానికి రూ. 700 అందుతాయని, వాటిని విసిరినందుకు అదనపు చార్జీలు ఇస్తారని భట్ చెప్పారు. ‘మీకు డబ్బు ఎవరు ఇస్తారు, ఎవరి ద్వారా మీకు ఆ డబ్బు అందుతుందీ, ఎలా అందుతుందీ?' అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.‘ఇది మా బతుకుతెరువు అంశం. మా ప్రాణం పోతుందన్నా మా వెనుకనున్న వ్యక్తుల గురించి చెప్పం' అని భట్ చెప్పారు. ‘కశ్మీరు పోలీసులు, సైనికులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధికారులపై మేము ఎన్నోసార్లు రాళ్లు రువ్వాం. ఇక ముందూ అదే చేస్తాం. ఇది మాకు తిండి పెడుతోంది. బారముల్లా, సొపోర్, పటాన్‌లలో కూడా నేను రాళ్లు విసిరాను' అని ఓ ప్రశ్నకు సమాధానంగా భట్ తెలిపారు.
ఇంతవరకు 50, 60 పెట్రోలు బాంబులు విసిరానని చెప్పారు. రాళ్లు రువ్వినందుకు ఒక్కో రోజు రూ. 1000 నుంచి రూ.3000 వరకు అందుకున్న సందర్భాలు ఉన్నాయని వసీం అహ్మద్ ఖాన్ తెలిపారు. మీకు డబ్బులిచ్చే వ్యక్తితో మీకు పరిచయం ఉందా? అన్న ప్రశ్నకు తన స్నేహితుడి ద్వారా తనకు పరిచయం అయ్యాడని లోన్ తెలిపారు. డబ్బులిచ్చే వ్యక్తి మిలిటెంటా లేదా టెర్రరిస్టా ? అని ప్రశ్నించగా, వారి గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేనని చెప్పారు. ఎక్కడ రాళ్లు రువ్వాలో, ఎప్పుడు రాళ్లు రువ్వాలో ముందస్తు ప్రణాళిక ఉంటుందా అన్న ప్రశ్నకు లోన్ సమాధానమిస్తూ ముందుగానే పక్కా వ్యూహంతో తమకు కబురు అందుతుందని చెప్పారు.

వ్యూహాత్మకంగానే దాడులు
రాళ్లు రువ్వే కుర్రవాళ్లలో పది, పన్నేండేళ్ల బాలలు కూడా ఉన్నారని, వారికి నెలకు రూ.5000 వరకు చెల్లింపులు ఉంటాయని వారు తెలిపారు. కండపుష్టి కలిగిన బలమైన యువకులకు గ్రూపులో చెల్లింపులు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. తమలో ఇప్పుడు చాలా వాట్సాప్ గ్రూపులున్నాయని, అత్యవసర సమయాల్లో గ్రూపు సందేశాలు పంపిస్తారని అహ్మద్ ఖాన్ తెలిపారు. వీరిలో ఒకరిద్దరు రాళ్లు రువ్విన సంఘటనల్లో అరెస్టయి ఆరు నెలలు జైలుకెళ్లిరాగా మరొకరి ఏడాది జైలు శిక్ష అనుభవించి వచ్చారు. జైలుకెళ్లి వచ్చినా మారలేదా ? అన్న ప్రశ్నకు ఇది తమ బతుకుతెరవని, మరోపని చేస్తూ బతకడం కష్టమని వారు చెప్పారు. గతేడాది జూలై నెల నుంచి అక్టోబర్ నెల వరకు రాళ్లు రువ్విన సంఘటనల్లో 92 మంది మరణించగా, 19 వేల మంది ప్రజలు గాయపడ్డారు. నాలుగువేల మంది భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. ఇద్దరు జవాన్లు మరణించారు. కశ్మీర్‌లో ఒక్క ఏడాదిలోనే రాళ్లు రువ్విన సంఘటనలు కొన్ని వేలుంటాయి.

లాప్ టాప్ వాడాల్సిన యువతే ఇలా..
లాప్ టాప్‌లు పట్టుకోవాల్సిన చేతులు రాళ్లు పట్టుకుంటున్నాయని కూడా నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నెలల తరబడి ఇంటర్నెట్ సర్వీసులను ప్రభుత్వమే నిలిపివేయడంతోపాటు ఉపాధి అవకాశాల కల్పనపై ద్రుష్టి పెట్టనప్పుడు వారు మాత్రం లాప్ టాప్‌లు పట్టుకొని ఏం చేస్తారు. రాళ్లు విసిరితే నాలుగు డబ్బులైనా వస్తాయని చెప్తున్నారు. గతేడాది మిలిటెంట్ బుర్హాని ఎన్‌కౌంటర్ జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు కశ్మీర్‌లో రెండు నెలలు కూడా ఇంటర్నెట్ పనిచేయలేదు. రాళ్లు రువ్వడంలో మరణిస్తున్నదీ, మిలిటెంట్లుగా మారుతున్న వారు కూడా బాగా చదువుకున్న వారే కావడం గమనార్హం. ఎంతో మంది ఇంజనీరింగ్ చదవిన విద్యార్థులు ఉద్యోగాలు రాక, టెర్రరిజం వైపు మొగ్గు చూపుతున్న విషయం తెల్సిందే.












Click it and Unblock the Notifications