భార్య మృత దేహాన్ని మోసిన మాఝీకి రూ. లక్షల సాయం!
భువనేశ్వర్: ఆస్పత్రిలో వైద్యం అందక తన భార్య మరణిస్తే, మృతదేహాన్ని తరలించేందుకు కూడా డబ్బుల్లేని స్థితిలో శవాన్ని భుజంపై వేసుకుని, కుమార్తెతో కలిసి పది కిలోమీటర్లకు పైగా నడిచిన ఒడిశాలోని కలహండి ప్రాంతానికి చెందిన దానా మాఝికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు వరుసగా ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తుననాయి.
దీంతో నెల రోజుల క్రితం చేతిలో రూపాయి కూడా లేని స్థితిలో ఉన్న దానా, వద్ద లక్షల రూపాయలు విరాళాల రూపంలో వచ్చిపడుతున్నాయి. దానా తన భార్య మృతదేహాన్ని తీసుకువెళుతున్న వార్తను దేశవ్యాప్తంగా సంచలనం స్రుష్టించడంతో.. ఎంతో మంది స్పందించి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

బెహరైన్ ప్రధాని నుంచి సామాన్యుల వరకు ఎంతో మంది వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు ఆయనకు డబ్బు పంపగా, తన బిడ్డలను చదివించుకునేందుకు వీటిని వినియోగిస్తానని దానా చెబుతున్నాడు. ఆయన పిల్లలకు ఎంత వరకైనా ఉచితంగా విద్యను చెప్పిస్తామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించి, ఇందిరా ఆవాస్ యోజన కింద ఇంటి నిర్మాణానికి రూ. 75 వేలను ఇచ్చారు.
రెడ్ క్రాస్ సంస్థ రూ. 30 వేల సాయం చేయగా, జాతీయ కుటుంబ సంక్షేమ శాఖ రూ. 52 వేలను, బియ్యం కోటాను ఇప్పించింది. సులభ్ ఇంటర్నేషనల్ రూ. 5 లక్షల డబ్బును ఐదేళ్ల కాలపరిమితికి ఫిక్సెడ్ చేసి, పెద్ద కుమార్తె చాందికిని ఉద్యోగం ఇస్తామని, అది వద్దనుకుంటే, వివాహం జరిగేంతవరకూ నెలకు రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించింది.
మహారాష్ట్ర స్వచ్ఛంద సంస్థ ఒకటి రూ. 80 వేలను దానాకు, ముగ్గురు కుమార్తెలకు రూ. 10 వేల చొప్పున ఇచ్చింది. గుజరాత్ కు చెందిన ఇద్దరు వ్యాపారులు చెరో లక్ష రూపాయలను, యూఎస్ లో ఉన్న ఒడిశా వాసి ఒకరు రూ. 1.05 లక్షలను పంపారు.
ఇలా చాలా మంది అతని దానా కుటుంబానికి సాయం చేస్తున్నా.. అతని ఇరుగు, పొరుగు వారు మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ఇటువంటి బీదవారు తమ ఊరిలో ఇంకా మరెందరో ఉన్నారని గుర్తు చేస్తూ, వారెవరిపై లేని ప్రేమ, దయ దానాపై మాత్రమే ఎందుకంటూ ప్రశ్నిస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications