ఢిల్లీకి రేవంత్ రెడ్డి - తెలంగాణ తాజా పరిణామాలపై: స్టీరింగ్ కమిటీ భేటీలో
న్యూఢిల్లీ: తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి సరిగ్గా 12 నెలల సమయం ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోన్నాయి. అధికార టీఆర్ఎస్.. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గురి పెడుతోంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.

రాజకీయ వేడి..
టీఆర్ఎస్‌ను గద్దె దించడానికి భారతీయ జనత పార్టీ వ్యూహాలు పన్నుతోంది. నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో ఎదురైన ఓటమి ఆధారంగా తన బలాబలాలను బేరీజు వేసుకుంటోంది. నియోజకవర్గాల స్థాయిలో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోంది. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్.. తన మరో విడత పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా పార్టీ నాయకత్వం ఖరారు చేసింది.

మునుగోడు ఎఫెక్ట్..
ఈ రెండింటి కంటే భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది కాంగ్రెస్. మునుగోడులో ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసేంత వరకూ మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్‌దే. అభ్యర్థిని మార్చిన నేపథ్యంలో దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. పాల్వాయి స్రవంతి రెడ్డి ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. మూడో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ డీలా పడింది.

దాడులతో..
అదే సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఈడీ, ఐటీ దాడులు తీవ్రతరం అయ్యాయి. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టడం అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధువుల నివాసాలపైనా దాడులు కొనసాగాయి. ఈ సందర్భంగా అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. వీటి ఆధారంగా మొత్తం డొంకను లాగే ప్రయత్నం చేస్తోన్నారు.

4న స్టీరింగ్ కమిటీ..
ఇలాంటి వాతావరణం మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఢిల్లీ వెళ్లనున్నారు. వచ్చేనెల 4వ తేదీన ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ భేటీకి ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొత్తగ బాధ్యతలను స్వీకరించిన మల్లికార్జున ఖర్గె సారథ్యంలో తొలిసారిగా ఈ స్టీరింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, ప్లీనరీ ఏర్పాటు, భారత్ జోడో యాత్ర వంటి అంశాలను ప్రస్తావనకు రానున్నాయి.

తెలంగాణ స్థితిగతులపై..
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తెలంగాణలో రాజకీయ స్థితిగతులపైనా మల్లికార్జున ఖర్గె ఆరా తీసే అవకాశం ఉంది. దీనికోసం రేవంత్ రెడ్డిని పూర్తి నివేదికలను ఢిల్లీకి పిలిపించుకున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు, టీఆర్ఎస్‌తో అనుసరించాల్సిన వైఖరి, ఇతర వ్యూహాలు, తదితర అంశాలు వారిద్దరి మధ్య చర్చకు రావొచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications