ఎన్నారై వివాహ మోసాలపై మరింత కఠినంగా..: లా కమిషన్ సిఫార్సులు
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCIs)తో ముడిపడిన మోసపూరిత వివాహాలు పెరుగుతుండటంపై లా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాక, ఈ పెళ్లిళ్లకు సంబంధించి ఓ సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. ఎన్నారైలు, ఓసీఐలు.. భారత పౌరుల మధ్య జరిగే వివాహలను భారత్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించింది.
ఈ అంశాలపై రూపొందించిన ఓ రిపోర్టును న్యాయశాఖకు అందించింది. ఎన్నారై, ఓసీఐలకు సంబంధించిన మోసపూరిత వివాహాలు.. భారత్‌కు చెందిన జీవిత భాగస్వాములను, ముఖ్యంగా మహిళలను ప్రమాదకర పరిస్థితుల్లో నెడుతున్నాయని కొన్ని నివేదికలు ప్రస్తావిస్తున్నట్లు లా కమిషన్ ఛైర్ పర్సన్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రుతురాజ్ అవస్థీ వెల్లడించారు.

విడాకులు, మనోవర్తి, పిల్లల సంరక్షణ, ఎన్నారైలు, ఓసీఐలకు సమన్లు, వారెంట్లు, ఇతర న్యాయపరమైన పత్రాల జారీకి సంబంధించిన నిబంధనలను సమగ్ర చట్టంలో చేర్చాలని తెలిపారు. పాస్‌పోర్టుపై వివాహ స్టేటస్, జీవిత భాగస్వామి పాస్ పోర్టును అనుసంధానించడం, భార్యాభర్తలిద్దరి పాస్ పోర్టులపై వివాహ రిజిస్ట్రేషన్ నెంబర్ ను పొందుపర్చడం వంటివి తప్పనిసరి చేయడానికి పాస్ పోర్టు చట్టం, 1967లో అవసరమైన సవరణలను తీసుకురావాలని లా కమిషన్ సిఫార్సు చేసింది. తాజా సిఫార్సులతో వివాహ మోసాలను చాలా వరకు కట్టడి చేయవచ్చని పేర్కొంది.












Click it and Unblock the Notifications