సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి సుభాష్ రెడ్డి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణకు చెందిన జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డి నియమితులు కానున్నారు. 'సుప్రీంకోర్టు'కు నలుగురు న్యాయమూర్తులను నియమించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసిన జాబితాలో గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుభాష్‌రెడ్డి పేరు కూడా ఉంది.
ఆయనతో పాటు పాట్నా, మధ్యప్రదేశ్, త్రిపుర హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగిల పేర్లను సూచించారు. వీటిని కేంద్రం ఆమోదిస్తే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 28కు చేరుతుంది. మొత్తం 31మంది న్యాయమూర్తులకుగాను సుప్రీంకోర్టులో ప్రస్తుతం 24 మంది ఉన్నారు.

కాగా, మెదక్ జిల్లా కమరం గ్రామానికి చెందిన జస్టిస్ సుభాష్‌రెడ్డి 1980 అక్టోబరులో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. ఆయన 2001లో ఏపీ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
2002లో ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2016 ఫిబ్రవరి 13న గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇది ఇలా ఉండగా, ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి 'సుప్రీం' కొలీజియం తాజాగా కేంద్రానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర ఎస్ చౌహాన్‌ను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు, కర్ణాటక హైకోర్టుకే చెందిన జస్టిస్ వినీత్ కొఠారిని అలహాబాద్‌కు బదిలీ చేశారని సమాచారం. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీబీ భజంత్రిని కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని కూడా కొలీజియం సూచించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications