భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర: సబ్సిడీ సిలిండర్ రూ.6, సబ్సిడీయేతర ధర రూ.133 తగ్గింపు
న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. సబ్సిడీ ఎల్బీజీ సిలెండర్ పైన రూ.6.52 మేర తగ్గిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఈ రోజు (శుక్రవారం) ప్రకటించింది. ఈ ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి రానున్నాయి.
14.2కేజీల సబ్సిడీ ఎల్పీజీ సిలెండర్ ధర ఢిల్లీలో రూ.507.42గా ఉంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయి. దీంతో సిలెండర్ ధర రూ.500.90 అవుతుంది.

జూన్ నెల నుంచి సిలెండర్ ధర పెరుగుతోంది. ఇప్పటి వరకు ఆరుసార్లు వంట గ్యాస్ ధరను పెంచారు. ఈ ఆరు నెలల్లో రూ.14.13 మేర గ్యాస్ ధర పెరిగింది. రూపాయి విలువ బలపడటంతో పాటు, అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో ఎల్పీజీ ధరలు భారీగా తగ్గినట్లు ఐఓసీ తెలిపింది.
సబ్సిడీయేతర సిలెండరు ధరపై రూ.133 తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు సబ్సిడీయేతర సిలెండరు ధర రూ.942.50గా ఉంది. ఇక నుంచి ఢిల్లీలో సబ్సిడీయేతర ఎల్‌పీజీ సిలెండరు ధర రూ.809.50గా ఉంటుంది. గృహ వినియోగదారులకు సబ్సిడీ కింద ఏటా 12 సిలెండర్లను ఇస్తారు. సబ్సిడీ నగదును వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. డిసెంబరు నెల నుంచి సబ్సిడీ కింద వినియోగదారులకు రూ.308.60 నగదును బ్యాంకు ఖాతాల్లో వేస్తారు.












Click it and Unblock the Notifications