జైల్లో మంత్రాలతో భయపెడుతున్న సుధాకరన్: మేము ఉండలేం!
శశికళ అక్క కుమారుడు వీఎన్. సుధాకరన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో రాత్రిపూట కాళీమాత ఫోటో ముందు పెట్టుకుని గట్టిగా మంత్రాలు చదువుతూ సాటి ఖైధీలను భయపెడుతున్నారు.
బెంగళూరు: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ అక్క కుమారుడు సుధాకరన్ జైల్లో సాటి ఖైదీలను మంత్రాలతో భయపెడుతున్నాడని వెలుగు చూసింది.
పరప్పన అగ్రహార జైల్లో మగ ఖైదీలు ఉన్న బ్యారెక్ లో సుధాకరన్ శిక్ష అనుభవిస్తున్నాడు. సుధాకరన్ జైలుకు వెళ్లినప్పటి నుంచి రాత్రి పూట నిద్రపోకుండా కాళీమాత ఫోటో ముందు పెట్టుకుని గట్టిగా మంత్రాలు చదువుతున్నాడు. దీంతో తోటి ఖైదీలు సుధాకరన్ ను ఓ మంత్రగాడిగా భావిస్తూ భయపడుతున్నారు.

అయ్యా జైలర్ గారు మేము ఉండలేం
సుధాకరన్ నిత్యం రాత్రిపూట మత్రాలు చదువుతూ మమల్ని భయపెడుతున్నారని, వెంటనే ఆయన్ను ఇక్కడి నుంచి వేరే గదికి తరలించాలని సాటి ఖైదీలు జైలు సిబ్బంది మీద ఒత్తిడి చేస్తున్నారు. జైలు అధికారులు సుధాకరన్ కు గట్టిగా మంత్రాలు చదవరాదని చెప్పినా ఆయన పట్టించుకోవడం లేదని తెలిసింది.

కావాలనే సుధాకరన్ అలా చేస్తున్నారా ?
శశికళ అక్క కుమారుడు సుధాకరన్ తనకు ప్రత్యేక గది ఇవ్వాలని జైలు అధికారులకు మనవి చేశారు. అయితే పరప్పన అగ్రహార జైలు అధికారులు సుధాకరన్ ను ప్రత్యేక సెల్ కు తరలించడానికి నిరాకరించారు. అందుకే కావాలనే సుధాకరన్ మంత్రాలతో సాటి ఖైదీలను భయపెడుతున్నారని సమాచారం.

కొంతకాలం చూస్తాం, తరువాత మా పని మేం చేస్తాం
రాత్రిపూట గట్టిగా మంత్రాలు చదవరాదని పరప్పన అగ్రహార జైలు అధికారులు సుధాకరన్ కు సూచించారు. అయితే ఆయన పద్దతి మార్చుకోకుంటే మా పని మేం చేస్తామని జైలు అధికారులు అంటున్నారు. మొత్తం మీద సుధాకరన్ రాత్రి పూట తన మంత్రాలతో సాటి ఖైదీలకు సినిమా చూపిస్తున్నాడు.

గుంపులు గుంపులుగా
పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు దగ్గరకు ప్రతి రోజు చిన్నమ్మ శశికళను చూడటానికి అనేక మంది వస్తున్నారు. జైలు ముందు గుంపులు గుంపులుగా నిలబడరాదని పోలీసులు వారికి సూచించారు. అయితే వారు చెప్పిన మాట వినకపోవడంతో పరప్పన అగ్రహార పోలీసులు లాఠీలకు పని చెప్పి వారిని అక్కడి నుంచి తరలిస్తున్నారు.

ఎవరు పంపిస్తున్నారు
అన్నాడీఎంకే ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీ కార్యకర్తలు శశికళ నాయకత్వాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రతిరోజు చిన్నమ్మను చూడాలి అంటూ జైలు దగ్గరకు చాల మంది చేరుకుంటున్నారు. వీరిని జైలు దగ్గరకు ఎవరు పంపిస్తున్నారు అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని బెంగళూరులోని జయలలిత అభిమాన సంఘాల నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications