వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రిప్టోకరెన్సీలో రూ.70 లక్షల పెట్టుబడులు, నష్టాలు రావడంతో ఆత్మహత్య: ‘నేనిలా చేస్తానని కలలో కూడా ఊహించలేదు..’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం ఉపాధ్యాయుడు

క్రిప్టోమైనింగ్ చేసిన ఖమ్మం నగరానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.

పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన రామలింగస్వామి ఉపాధ్యాయుడిగా ఉంటూ వివాన్ స్కూల్ నడిపించేవారు.

కరోనా కారణంగా తీవ్రమైన సమస్యలు వచ్చి పడ్డాయి.

స్కూల్ కోసం డబ్బులు పెట్టిన ఆయన నష్టాల పాలయ్యారు.

మొదట్లో లాభం.. ఆ తర్వాత నష్టాలు..

అదే సమయంలో మిత్రుల సలహాతో లాక్‌డౌన్‌లో క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. మొదట ఐదు లక్షలు పెట్టారు. మొదట్లో బాగానే లాభం వచ్చింది.

దాంతో మరింత ఎక్కువ పెట్టుబడి పెట్టారు. దానికోసం తన దగ్గరున్న డబ్బులతో పాటు అప్పులు చేసి క్రిప్టోకరెన్సీలో పెట్టారు. దాంతో పాటుగా మరికొందరితో పెట్టుబడులు పెట్టించారు. దాదాపు రూ. 70 లక్షలు క్రిప్టోకరెన్సీలో పెట్టారు.

కానీ మొదట డబ్బులు వెనక్కి వచ్చినా ఆ తర్వాత నష్టాలు వచ్చాయంటూ తిరిగి ఇవ్వలేదని చెబుతున్నారు.

"సమస్యల్లో పడ్డాం. మా దగ్గర ఉన్న బంగారం అమ్మేసి కొందరికి డబ్బులు ఇచ్చేశాం. ఇంకొన్ని అప్పులు ఉండిపోయాయి. వారి నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. రామలింగస్వామి ఆత్మహత్య చేసుకోవడానికి అవే కారణం" అంటూ రామలింగస్వామి సన్నిహిత బంధువు నరసింహరావు బీబీసీకి తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం ఉపాధ్యాయుడి కుటుంబం

'బలవంతంగా కారు లాక్కుని ఇబ్బంది పెట్టారు'

ఆన్‌లైన్ పెట్టుబడుల కోసమంటూ రామలింగస్వామి అప్పులు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు ప్రాంతానికి చెందిన కొందరి నుంచి కూడా ఆయన అప్పు తీసుకున్నారు. తనకు తోడుగా మరికొందరితో కూడా ఆయన పెట్టుబడులు పెట్టించారు.

అయితే ఆ అప్పు తీర్చే విషయంలో డబ్బుల కోసం తీవ్రంగా ఇబ్బంది పెట్టారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

"రూ. 70 లక్షల అప్పుల్లో కొంత తీర్చేశాము. మిగిలింది కూడా తీరుస్తామని చెప్పాము. కానీ సెటిల్‌మెంట్ చేసుకుందామని పిలిచి నా భర్తను బంధించారు. బలవంతంగా కారు లాక్కున్నారు. ఖాళీ చెక్కుల మీద సంతకాలు పెట్టించుకున్నారు. అంతా చెల్లిస్తామని చెప్పినా దౌర్జన్యంగా వ్యవహరించారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలోకి నెట్టారు. అది ఆయన్ని కుంగదీసింది. తన సూసైడ్ లెటర్‌లో కూడా దీన్ని ప్రస్తావించారు.

మానసికంగా ఇబ్బంది పెట్టడంతో చాలా దిగాలుగా ఉండేవారు. కోలుకునేందుకు చాలా ప్రయత్నించాం. ధైర్యం చెప్పే ప్రయత్నాలు చేశాం. హైదరాబాద్ వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లారు. రూ. 5 లక్షలు రావాల్సి ఉందని, వాటిని తీసుకొస్తానని అన్నారు. ఈనెలాఖరున మా పెళ్లిరోజు. ఈలోపే మాకు సూర్యాపేట పోలీసుల నుంచి ఆయన చనిపోయినట్టు సమాచారం వచ్చింది" అంటూ రామలింగస్వామి భార్య స్వాతి బీబీసీతో అన్నారు.

ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం ఉపాధ్యాయుడి

దొరికిన పురుగు మందుల డబ్బా, సూసైడ్ నోట్

నవంబర్ 22న ఖమ్మం నుంచి బైక్ పై బయలుదేరిన రామలింగస్వామి సూర్యాపేటలోని ఒక ప్రైవేటు లాడ్జిలో దిగారు. ఆ రాత్రి అక్కడే ఉన్న ఆయన 23న మధ్యాహ్నం తర్వాత కూడా బయటకు రాలేదు. 24వ తేదీ ఉదయం కూడా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సూర్యాపేట టు టౌన్ పోలీసులు గది లోపలికి వెళ్లి చూసేసరికి ఆయన చనిపోయి ఉన్నట్లు చెబుతున్నారు.

"గదిలో సూసైడ్ నోట్ ఉంది. పురుగుల మందు డబ్బా దొరికింది. శివపురం సర్పంచ్ సహా మరికొందరు తనను ఒత్తిడి చేసి కారు తీసేసుకున్నారని రాశారు. మృతుడి భార్య కూడా మాకు ఫిర్యాదు చేశారు. విచారణ చేస్తున్నాము.

క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టి నష్టపోయినట్టు భావిస్తున్నాం. ఎక్కువ లాభాల కోసం ఆయన పెట్టుబడులు పెట్టడమే కాకుండా, వేరేవాళ్లతో కూడా పెట్టించారు. నష్టాలు రాగానే వారందరి ఒత్తిడి పడినట్టు నోట్‌లో ఉంది.

పోస్టుమార్టం రిపోర్ట్ రావాలి. పూర్తి కారణాలు, దానికి ఎవరైనా కారకులున్నారా అనేది విచారణలో తేలుతుంది" అంటూ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న ఎస్‌ఐ వీరమల్లయ్య బీబీసీకి తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం ఉపాధ్యాయుడు

సూసైడ్ నోట్‌లో ఏముంది?

"నేను ఆన్‌లైన్ బిజినెస్‌లో మొత్తం లాస్ అయ్యాను. అలాగే నాతో పాటు కొంతమంది కూడా లాస్ అయ్యారు. నేను ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు.

స్వాతి.. పిల్లలు జాగ్రత్త. నాన్న నీకు తోడుగా ఉంటారు. నువ్వు ధైర్యంగా ఉండు. కానీ నేనిలా చేస్తానని కలలో కూడా ఊహించలేదు. ఒత్తిడి తట్టుకోలేకే ఇలా చేశాను. అర్థం చేసుకో.

వేణు.. నా ఫ్యామిలీకి ఆర్థికంగా సపోర్ట్ చేయరా ప్లీజ్. నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. నేను ఆర్థికంగా నష్టపోయాను. అది నీకు తెలుసు. ప్లీజ్ రా కొంచెం వాళ్లను ఆర్థికంగా చూసుకో" అని సూసైడ్ నోట్‌లో ఉంది.

నకిలీ యాప్‌లో పెట్టడమే అసలు కారణమా?

క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టాలంటూ పలు రూపాల్లో ప్రచారం సాగుతోంది. వాటికి తోడుగా నకిలీ వాలెట్ యాప్‌లు కూడా మనుగడలో ఉన్నాయి. ఎక్కువ లాభాల కోసం చేసిన ప్రయత్నంలో రామలింగస్వామి సహా ఆయనకు తెలిసినవారు పెట్టుబడులు పెట్టింది కూడా నకిలీ యాప్‌లోనేననే వాదన కూడా ఉంది.

రామలింగస్వామి ఏ యాప్‌లో పెట్టుబడులు పెట్టారన్న దానిపై కుటుంబ సభ్యుల దగ్గర కూడా సమాచారం లేదు. పోలీసులు కూడా ఈ విషయంలో ఇంకా ఓ నిర్ధరణకు రాలేదని అంటున్నారు. ఆన్‌లైన్ వ్యాపారమని మాత్రమే సూసైడ్ నోట్‌లో పేర్కొనడంతో అసలు ఏ యాప్ ద్వారా పెట్టుబడులు పెడితే నష్టం వచ్చిందనే విషయంలో స్పష్టత రాలేదని పోలీసులు చెబుతున్నారు.

అదే సమయంలో విజయవాడకు చెందిన తన మిత్రుల ప్రోద్భలంతో రామలింగస్వామి పెట్టుబడులు పెట్టింది ఓ నకిలీ యాప్‌లోననే ప్రచారం సాగుతోంది.

ఖమ్మం పరిసరాల్లో అలాంటి యాప్‌లలో పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్న వారు చాలామంది ఉన్నారని స్థానికంగా మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న ఎం. చంద్రశేఖర్ బీబీసీతో అన్నారు.

"ఈ నకిలీ యాప్‌ల ప్రభావం ఉంది. మా మిత్రులు కూడా కొందరు నష్టపోయారు. మాస్టారు పెట్టుబడులు కూడా అందులో పెట్టినట్టు అనుమానాలున్నాయి. కానీ ఎక్కడ పెట్టుబడులు పెట్టారనేది మాకు కూడా పూర్తిగా తెలియదు. అలా నష్టపోయిన వారు మాత్రం ఉన్నారు. అందులో ఎక్కువ మంది యువకులే ఉంటున్నారు" అంటూ చంద్రశేఖర్ తెలిపారు.

బిట్‌కాయిన్

ఆధారం కోల్పోయిన రామలింగస్వామి కుటుంబం

38 సంవత్సరాల వయసున్న రామలింగస్వామికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 8 ఏళ్ల కూతురు, ఆరేళ్ల కొడుకు భారం ఇప్పుడు ఆయన భార్య స్వాతి మీద పడింది.

విద్యార్థుల భవిష్యత్తు కోసం లెక్కలు బోధించిన ఐఐటీ ఫ్యాకల్టీ ఇలా క్రిప్టోకరెన్సీ లాభాల కోసం లెక్క తప్పడం స్థానికంగా అందరినీ కలచివేస్తోంది.

క్రిప్టోకరెన్సీలో నష్టాల కారణంగా ఇప్పటికే పంజాబ్, కేరళ, నోయిడా ప్రాంతాల్లో కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇదే మొదటి కేసని పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Suicide due to loss of Rs 70 lakh investment in cryptocurrency: ‘I never dreamed I would do that
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X