సునంద ట్వీట్ మిస్టరీ, 2డేస్‌గా తాగుతూ: హత్య కోణం?
న్యూఢిల్లీ: "రోహన్, రుచికా.. ఏదో ఒకరోజు భారతీయులకు నిజం తెలుస్తుంది. దాన్ని వారు తట్టుకోలేరని నాకు తెలుసు ఇన్షా అల్లా'' అని జనవరి 16వ తేది సాయంత్రం సునంద పుష్కర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ఆమె పేర్కొన్న రుచికా తోమార్ హెడ్‌లైన్స్‌టుడే చానెల్ యాంకర్. రోహన్ కుమార్ ఒక సాధారణ వ్యక్తి. వారినే ఉద్దేశించి సునంద ఈ ట్వీట్లు ఎందుకు చేశారనేది అంతుబట్టని విషయం.
15వ తేదీ రాత్రి రోహన్ కుమార్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి సునంద ప్రస్తావించిన శశిథరూర్ ఐపిఎల్ క్రైమ్ గురించి స్పందించారు. అలాగే, 15వ తేదీ ఉదయం 'అర్ణబ్ గోస్వామి మీద మీరు ఏ లిక్కర్ విసిరారో ఈ రోజు రాత్రి న్యూస్ అవర్‌లో దేశమంతా తెలుసుకోవాలనుకుంటోంది'' అని ట్వీట్ చేశారు. వీటిలో ఏ ట్వీట్‌కు స్పందనగా సునంద స్పందించారనేది మిస్టరీగా మారింది.

సునంద పుష్కర్ మృతి విషయం బయటకు రాగానే దర్యాప్తు ప్రారంభించిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ శశిథరూర్, ఆయన సహాయకులు, సిబ్బందిని ప్రశ్నించి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. థరూర్ సిబ్బంది చెప్పిన ప్రకారం సునంద చనిపోవడానికి ముందు రెండు రోజులుగా ఏమీ తినలేదని తెలుస్తోంది. ఆ 48 గంటలూ ఆమె అదేపనిగా సిగిరెట్లు తాగుతూ మద్యం సేవించారని, నిద్ర పట్టడానికి మాత్రలు వాడారని సమాచారం.
మరోవైపు సునంద పుష్కర్ మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సునంద బంధువులు కూడా విచారణ జరిపించాలంటున్నారు. కేంద్రమంత్రి శశిథరూర్ విచారించాలంటున్నారు. సునంద కజిన్ అను పండితా జమ్ము కాశ్మీర్‌లో ఉంటున్నారు. ఆమెకు పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని కజిన్ చెబుతున్నారు. ఆమె చాలా ధైర్యవంతురాలని, ఆమె ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారని, ఆమె తనంత తానుగా ఎదిగారని, అందరిలా ఆమె ఆత్మహత్య చేసుకునే రకం కాదని చెబుతున్నారు.
ఆమె తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని నిలిచారన్నారు. జీవితంలో ఎదిగేందుకు ఆమె చేసిన కృషిని తాము చూశామన్నారు. తనను సునంద కజిన్‌లా కాక కొడుకులా భావించేదన్నారు. మృతిపై సిబిఐ విచారణ చేయించాలన్నారు. ఆమె బంధువులకు ఎంతో సహాయం చేశారన్నారు.
కాగా, సునందను ఎవరో పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేసినట్టు కనిపిస్తోందని భారతీయ జనతాపార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడ్డారు. సునంద బతికుంటే ఎవరికి ప్రమాదమో దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications