సునంద మృతి వెంటాడుతుంది, రాత్రంతా ఏడ్చా: మెహర్
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పాకిస్తాన్ జర్నలిస్టు మెహర్ తరర్ అన్నారు. సునంద పుష్కర్ తనను కొన్నేళ్ల పాటు వెంటాడుతుందని చెప్పారు. సునంద మృతి చెందిన విషయం తెలిసి తాను రాత్రంతా ఏడ్చానని చెప్పారు. ఇటీవల వివాదం తనను ఆవేదనకు గురి చేసిందన్నారు.
కాగా, మోతాదుకు మించిన మత్తుపదార్థాలు తీసుకోవడం వల్లనే సునంద పుష్కర్ మరణించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె ఆల్కహాల్ తీసుకున్న ఛాయలు కనిపించలేదని అఖిల భారత వైద్య విజ్జాన సంస్థ (ఎయిమ్స్) వైద్య నిపుణులు అంటున్నారు. మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు వాడే అల్ప్రాజోలమ్‌ను మోతాదుకి మించి తీసుకున్నారనే అనుమానాలను తోసిపుచ్చలేమని అంటున్నారు.

ఆమె తక్కువ వ్యవధిలో 27 మాత్రలు తీసుకొని ఉండవచ్చునని, అక్కడ దొరికిన స్క్రిప్టులే అందుకు ఆధారమని చెబుతున్నారు. దాని వల్లనే ఆమె మరణించి ఉండవచ్చునని అంటున్నారు. ఆమె గదిలో అల్ప్రాక్స్‌కు చెందిన ఖాళీ స్ట్రిప్ దర్యాప్తు అధికారులకు లభించింది.
మరోవైపు, సునంద పుష్కర్ మృతిపై దర్యాప్తు వేగిరం చేయాలని కేంద్ర హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణకు పూర్తిగా సహకరిస్తానని థరూర్ తనకు లేఖ రాశారని షిండే సోమవారం ఇక్కడ వెల్లడించారు.












Click it and Unblock the Notifications