బీసీఐ ఛైర్మన్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. అధికారాలపై ఆంక్షలు!
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా పదవీకాలంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నూతన ఎన్నికలు జరిగేంత వరకు ఆయన కేవలం 'ప్రొటెమ్'(తాత్కాలిక) ఛైర్మన్ గా మాత్రమే కొనసాగుతారని బుధవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నాయకత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఇకపై బీసీఐ ఎలాంటి కీలక విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్‌లను సంప్రదించాల్సిందేనని ఆదేశించింది.
అధికార దుర్వినియోగం, నిధుల మళ్లింపు ఆరోపణలు
ఈ విచారణ సందర్భంగా పిటిషనర్లు, యువ న్యాయవాదులు బీసీఐ తీవ్ర అక్రమాలకు పాల్పడినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 2020లో ఏర్పాటైన 'బీసీఐ పెర్ల్ ఫస్ట్ ట్రస్ట్'లో మనన్ కుమార్ మిశ్రా, ఇతర అధికారులు శాశ్వత మేనేజింగ్ ట్రస్టీలుగా అవతరించారని.. ఈ ట్రస్ట్ గోవా ప్రభుత్వంతో కలిసి 56 ఎకరాల స్థలంలో యూనివర్సిటీ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందని సవాల్ చేశారు. అలాగే సన్మానాలు, వేడుకల పేరిట కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని, ఛైర్మన్ పదవీకాలాన్ని ఐదేళ్లకు పెంచుకుంటూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

ధర్మాసనం తీవ్ర ఆగ్రహం
విచారణ వేళ జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్సి స్పందిస్తూ.. "మీరు కేవలం ప్రొటెమ్ ఛైర్మన్ మాత్రమే. రాబోయే ఎన్నికలతో మీ పదవీకాలం ముగుస్తుంది. అటార్నీ జనరల్ కూడా బీసీఐలో ఛైర్మన్ తో సమానమైన శాశ్వత సభ్యుడే" అని పేర్కొన్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్‌లకు ముందస్తు నోటీసులు ఇచ్చి, వారిని భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. శాశ్వత ట్రస్టీలుగా మారడంపై ప్రశ్నిస్తూ.. ఎన్నుకోబడిన ప్రతినిధులు తమ పరిధికి మించి శాశ్వత ట్రస్టీలుగా ఎలా మారతారని నిలదీశారు.
12 ఏళ్లుగా కొనసాగుతున్న ఆధిపత్యం
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. మనన్ కుమార్ మిశ్రా నవంబర్ 2014 నుంచి దాదాపు 12 ఏళ్లుగా నిరంతరాయంగా బీసీఐ ఛైర్మన్ గా కొనసాగుతున్నారని వెల్లడించారు. బీసీఐ నిబంధనల ప్రకారం ఛైర్మన్ పదవీకాలం రెండేళ్లు మాత్రమే అయినప్పటికీ.. ఏప్రిల్ 2025లో ఓ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తమ పదవీకాలాన్ని 2030 వరకు పొడిగించుకున్నారని చూపించారు. ఇటీవల నల్సార్ లా వర్సిటీ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను నిషేధించేందుకు ప్రయత్నించి తీవ్ర నిరసనల అనంతరం మిశ్రా క్షమాపణలు చెప్పిన ఘటనను కూడా ధర్మాసనం పరిశీలనకు తీసుకోబడింది.
బార్ కౌన్సిల్ ఎన్నికలకు ఆదేశాలు
ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు రెండు వారాల్లోగా రాష్ట్ర బార్ కౌన్సిళ్లలోకి ఇద్దరు మహిళా సభ్యుల సహకారాన్ని(కో-ఆప్షన్) పూర్తి చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత ఓ వారంలోగా రాష్ట్ర బార్ కౌన్సిళ్లు తమ నూతన కూర్పును నోటిఫై చేయాలని సూచించింది. తద్వారా రాష్ట్ర, కేంద్ర స్థాయిలో బార్ బాడీలకు నిర్ణీత వ్యవధిలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది.
నల్సార్ వివాదం నేపథ్యం
మనన్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్లు ఇటీవల నల్సార్ వివాదం తర్వాత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నల్సార్ యూనివర్సిటీ కాన్వకేషన్ కు సీజేఐ సూర్యకాంత్‌ను ఆహ్వానించడాన్ని విద్యార్థులు నిరసించారనే కారణంతో ఆ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల నమోదును నిలిపివేస్తూ మనన్ కుమార్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు రావడం, ఆ తర్వాత మనన్ కుమార్ మిశ్రా క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.














Click it and Unblock the Notifications