OBC కోటా ఉద్యోగాల క్రీమిలేయర్ పై సుప్రీంకోర్టు స్పష్టత..! కేంద్రం అభ్యర్ధనకు నో..!
ఓబీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో మార్చి 11న తాను ఇచ్చిన తీర్పుతో తలెత్తిన వివాదానికి సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ ముగింపు పలికింది. ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్ల వర్తింపు కోసం క్రిమీలేయర్ (అభిృద్ది చెందిన వారికి రిజర్వేషన్ వర్తింపచేయకపోవడం) అమలుకు తండ్రి వేతనం, వ్యవసాయ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మినహాయించాలని సుప్రీంకోర్టు మార్చి 11న తీర్పు ఇచ్చింది. అయితే దీన్ని అమలు చేయాలంటే గతంలో జరిగిన నియామకాలన్నింటినీ పరిశీలించాలని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనికోసం సమగ్ర విధానాన్ని అమల్లోకి తేవాలంటే రెండేళ్ల గడువు ఇవ్వాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. దీనిపై సుప్రీం స్పష్టత ఇచ్చింది.
ఈ ఏడాది మార్చి 11న ఓబీసీ క్రిమిలేయర్ (OBC Creamy Layer) ఖరారు కోసం తల్లితండ్రుల వేతనం, వ్యవసాయ ఆదాయాన్ని పిల్లల విషయంలో మినహాయించాలంటూ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రోహిత్ నాథన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంతకు ముందు కేంద్రం ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగుల పిల్లల విషయంలో ఈ రెండు ఆదాయాల్ని మినహాయించింది. అయితే ప్రైవేటు విషయంలో మాత్రం ఈ మినహాయింపు లేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు అన్యాయం జరుగుతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు అన్న తేడా లేకుండా అందరికీ వారి క్రిమీలేయర్ స్టేటస్ ఖరారులో తల్లితండ్రుల వేతనాలు, వ్యవసాయ ఆదాయాన్ని మినహాయించాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

ఇది అమలు చేయాలంటే గత నియామకాలన్నింటినీ పునఃపరిశీలించాలని, అలాగే భవిష్యత్తులో ఈ విధానం అమలుకు కొత్త నిబంధనల ఖరారుకు చాలా అంశాలు పరిశీలించాల్సి ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇందుకోసం రెండేళ్ల గడువు కోరింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు... తాము ఇచ్చిన తీర్పు గతంలో జరిగిన ఓబీసీ ఉద్యోగ నియామకాలకు వర్తించదని తేల్చిచెప్పింది. అంటే మార్చి 11 నుంచి ఇచ్చిన ఉద్యోగాల విషయంలోనే ఈ తీర్పు వర్తిస్తుంది. అలాగే కొత్త నిబంధనల రూపకల్పనకు కేంద్రం అడిగిన రెండేళ్ల గడువును కూడా ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వెంటనే తమ తీర్పును అమలు చేయాలని తెలిపింది. ఫైనల్ గా ఓబీసీ క్రీమీలేయర్ హోదా నిర్ణయించేటప్పుడు తల్లితండ్రుల జీతం ఆధారంగా, వారి వ్యవసాయ ఆదాయం మాత్రమే కాకుండా ఇతర అంశాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రానికి తేల్చిచెప్పింది.














Click it and Unblock the Notifications
