ఓబీసీ జాబితాలోకి తూర్పు కాపు సహా ఐదు కులాలు-కేంద్రానికి టీడీపీ డిమాండ్..!
ఏపీలో ఐదు అత్యంత వెనుకబడిన కులాల్ని కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు తాజాగా కేంద్రమంత్రి వీరేంద్రకుమార్ ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ కులాల వెనుకబాటును ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా గుర్తించిందని, కాబట్టి వీటిని వెంటనే ఓబీసీ జాబితాలో చేర్చాలని వారు కోరారు. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఉత్తరాంధ్రలో కీలకమైన కులాల్లో తూర్పు కాపు కూడా ఒకటి. అలాగే కళింగ వైశ్యులు, శిష్ణ కరణం, సొండి, అర్వల కులాల్ని సైతం ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని టీడీపీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. 1979లో మండల్ కమిషన్ ఏర్పడిన దగ్గరి నుంచీ ఈ కులాల్ని ఓబీసీల్లో చేర్చాలనే డిమాండ్ ఉందని వారు కేంద్రమంత్రి వీరేంద్ర కుమార్ కు వివరించారు.

రాష్ట్రంలో ఈ ఐదు కులాల్లో 12 లక్షల మంది జనాభా ఉన్నారని, వీరు ఆర్ధికంగా, విద్యాపరంగా, సామాజికరంగా వెనుకబడి ఉన్నారని టీడీపీ ప్రజా ప్రతినిధులు కేంద్రం దృష్టికి తెచ్చారు. అసలే కేంద్రానికి బీసీ జనగణన చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ ప్రజాప్రతినిధులు మరిన్ని కులాల్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై ఏపీ బీసీ కమిషన్ రిపోర్టు కూడా ఇవ్వడంతో దాని ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications