ఎలక్ట్రోరల్ బాండ్లతో క్విడ్ ప్రోకో ? సుప్రీంకోర్టు ఆందోళన-కీలక వ్యాఖ్యలు..
వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు షాకిచ్చేలా కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో నిధుల కోసం రాజకీయ పార్టీలు జారీ చేసే ఎలక్ట్రోరల్ బాండ్ల చెల్లుబాటుపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఇవి వ్యాపార ప్రయోజనాల కోసం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అత్యున్నత న్యాయస్ధానం అభిప్రాయపడింది.
ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై జరుపుతున్న విచారణలో పాలక రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా మారుపేర్లతో క్విడ్ ప్రోకో (నీకిది-నాకు అది) చేసే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఉదాహరణకు ఏ అనే కేవైసీ కలిగిన వ్యక్తి పేరుతో బీ అనే వ్యక్తి ఓ రాజకీయ పార్టీకి రూ.100 కోట్ల విరాళం ఇస్తే, అతను దాని కోసం సదరు వంద కోట్లను ఒక్కొక్కరి నుంచి కోటి చొప్పున సేకరిస్తే ఇది అక్రమం అవుతుంది కదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

కేవైసీ కలిగిన ఖాతా దారుల ద్వారా ఎలక్ట్రోరల్ బాండ్లను కొనుగోలు చేయించడం, అసలు దాతలు అజ్ఞాతంలో ఉండటం వల్ల రాజకీయ పార్టీలతో వారి క్విడ్ ప్రోకో కు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు తలెత్తవని ధర్మాసనంలో జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. అలాగే ఈ విరాళం ఎక్కడి నుంచి వచ్చిందనేది రాజకీయ పార్టీకి తెలుస్తుందని, ప్రజలకు మాత్రమే తెలియదని సీజే చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.
రాజకీయ పార్టీలు ఎలక్ట్రోరల్ బాండ్లు జారీ చేసే విధానం రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎలక్ట్రోరల్ బాండ్ల జారీ వల్ల జరుగుతున్న అక్రమాలు సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు కూడా తెలియడం లేదని పిటిషనర్ న్యాయవాది షాదన్ ఫరాసత్ కోర్టు దృష్టికి తెచ్చారు. తాజాగా ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా నిధుల సేకరణ వివరాలు ప్రజలు తెలియాల్సిన అవసరం లేదని కేంద్రం అఫిడవిట్ ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అలాగే దాత పేరు బహిర్గతం చేయకుండా ఉండటం అనేది అధికార పార్టీలకు భయపడకుండా విపక్షాలకు విరాళాలు ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపబడింది. అయితే పిటిషనర్ల తరపు వాదనలు ప్రారంభించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్, "రాజకీయ పార్టీ నిధుల గురించి తెలుసుకునే హక్కు ప్రాథమిక హక్కు" అని వాదించారు. ఎన్నికల బాండ్లను చట్టబద్ధమైన ముడుపులుగా ఆయన అభివర్ణించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుందని, 90 శాతం కంటే ఎక్కువ విరాళాలు పాలక పార్టీలకు వెళతాయని కూడా వాదించారు.












Click it and Unblock the Notifications