సనాతనం కామెంట్స్‌పై సుప్రీంకోర్టు సంచలనం
Supreme Court: సనాతన ధర్మానికి వ్యతిరేకంగా గతంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు భారీ ఊరట లభించింది. ఈ కామెంట్స్ ఆధారంగా చేసుకుని ఆయనపై కొత్తగా ఎలాంటి కేసులు గానీ, ఎఫ్ఐఆర్ గానీ నమోదు చేయకూడదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది.
వివిధ రాష్ట్రాల్లో ఇప్పటివరకు నమోదైన ఎఫ్ఐఆర్‌లన్నింటినీ కూడా ఏకీకృతం చేయాలని కోరుతూ ఉదయనిధి స్టాలిన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను వెలువడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ ఆదేశాలను ఇచ్చింది.

2023 సెప్టెంబర్‌లో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. వాటిని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఆ తరువాత కూడా దీన్ని సమర్థించుకున్నారాయన. కులం, మతం ఆధారిత వివక్ష, సామాజిక అన్యాయాలను మాత్రమే తాను విమర్శించానని చెప్పారు.
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్‌లల్లో ఎఫ్ఐఆర్‌లు రికార్డయ్యాయి. దీన్ని సవాల్ చేస్తూ ఉదయనిధి స్టాలిన్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాటన్నింటినీ ఏకీకృతం చేయాంటూ పిటీషన్ దాఖలు చేశారు.
తాజాగా దీనిపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఉదయనిధి తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వి తన వాదనలను వినిపించారు. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న ఎఫ్‌ఐఆర్‌లతో పాటు, బిహార్‌లో కొత్తగా ఫిర్యాదులు దాఖలయ్యాయని బెంచ్ దృష్టికి తీసుకువచ్చారు. నుపుర్ శర్మ సహా ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా సింఘ్వీ ప్రస్తావించారు.
ఈ విషయాన్ని బెంచ్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. కొత్త ఎఫ్ఐఆర్‌లు గానీ, కేసులు గానీ నమోదు చేయకూడదని ఆదేశించింది. ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వస్తే తమ అనుమతి తీసుకోవడం తప్పనసరి అని తేల్చి చెప్పింది. అనంతరం విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications