విజయ్ వ్యవహారాన్ని తేల్చేయనున్న సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కరూర్ తొక్కిసలాట ఘటనలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఈ ఘటనపై తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్.. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై అప్పీల్ కు వెళ్లారు. పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తొక్కిసలాటలో ప్రభుత్వం, టీవీకే పక్షాల వాదోపవాదాలను ఆలకించనుంది.
సెప్టెంబర్ 27వ తేదీన కరూర్ లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని, సమగ్ర విచారణ జరిపించాలని విజయ్ తొలుత.. మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై మద్రాస్ హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారాయన. సిట్ తో దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. తొక్కిసలాట ఘటనపై టీవీకేతో పాటు, తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకుడు, పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు జీఎస్ మణి దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా కోర్టు విచారణకు స్వీకరించింది. తొక్కిసలాట ఘటన పూర్వాపరాలను వెలికి తీయడానికి సీబీఐతో విచారణ జరిపించాలని మణి తన పిటీషన్ లో సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఈ రెండు పిటీషన్లు కూడా న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్ వీ అంజారియాతో కూడిన ధర్మాసనం ముందుకు రానున్నాయి. వీటిని ఈ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తమిళనాడుకే చెందిన బీజేపీ నాయకురాలు ఉమా ఆనందన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఇందులోనే క్లబ్ చేయడానికి ఈ ధర్మాసనం అంగీకరించింది. తమిళనాడు పోలీసు అధికారులు మాత్రమే విచారణ జరిపితే నిష్పక్షపాతంగా ఉండదని ఉమా ఆనందన్ వాదించారు.
మరోవంక- తొక్కిసలాట వివాదాల నుంచి బయటపడటానికి విజయ్ విశ్వప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలవారితో వీడియో కాల్‌లో మాట్లాడారు. వారికి భరోసా ఇచ్చారు. అన్ని రకాలుగా ఆదుకుంటానని చెప్పారు. త్వరలో వ్యక్తిగతంగా వచ్చి కలుస్తానని అన్నారు. మరణించిన ప్రతి కుటుంబాన్నీ పలకరిస్తానని, ఓదార్చుతానని విజయ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోన్నామని టీవీకే తెలిపింది.












Click it and Unblock the Notifications