పెగాసస్ పై సోషల్ మీడియాలో చర్చ- పిటిషనర్లకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ వివాదంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలతో పాటు ఈ వ్యవహారంపై విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు కూడా సోషల్ మీడియాలో దీనిపై చర్చలు సాగిస్తున్నారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నీ మీరే మాట్లాడేసుకుంటే ఇక మాతో పనేముందని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పిటిషనర్లపై సీరియస్ అయ్యారు.
ఓవైపు సుప్రీంకోర్టులో తమ పిటిషన్ పై విచారణ సాగుతుండగానే పిటిషనర్లు సోషల్ మీడియాలో చర్చలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్దానం.. వ్యవస్ధపై గౌరవం ఉంటే ఇలాంటి చర్చలకు దూరంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్వంలోని త్రిసభ్య బెంచ్ ఈ పిటిషన్లను విచారిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పిటిషనర్లు సోషల్ మీడియాలో తమ పిటిషన్లలో ఉన్న అంశంపై చర్చ పెట్టడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎవరూ లక్ష్మణ రేఖ దాటవద్దని, ఈ కేసులో అందరికీ తమ వాదన వినిపించే అవకాశం కల్పిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చర్చకు తాము విరుద్ధం కాదని, ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉందని, ఎలాంటి వాదనలైనా తమ ముందే జరగాలని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. కాబట్టి మీ వాదనేదైనా ఉంటే అది నేరుగా కోర్టులోనే వినిపించాలని ఆయన పిటిషనర్లకు సూచించారు.

Recommended Video
పెగాసస్ వివాదంపై దాఖలైన ఈ కేసులో తమ అభిప్రాయం చెప్పడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరింత సమయం కోరడంతో సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంటులో పెగాసస్ పై ప్రకటన చేసింది. కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ పెగాసస్ తయారీదారులతో తాము ఎలాంటి లావాదేవీలు జరపలేదని లోక్ సభలో తెలిపారు. అయినా విపక్షాలు మాత్రం ఈ సమాధానంతో సంతృప్తి చెందలేదు. ప్రభుత్వం విచారణకు ఆదేశించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో సాగుతున్న విచారణలో వచ్చే తీర్పు కీలకంగా మారబోతోంది.












Click it and Unblock the Notifications