మీరు ధ్యాస పెట్టట్లేదు: ఆ నివేదిక ఏమైంది..ప్రజలకు తెలిసేలా చేయండి: సీజేఐ ఎన్వీ రమణకు లేఖ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు నెలల తరబడి తమ ఆందోళనలను కొనసాగిస్తోన్నారు. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో కిసాన్ మహాపంచాయత్‌కు సిద్ధపడుతోన్నారు. కర్నాల్ వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహించనున్న ఈ కిసాన్ మహా పంచాయత్‌లో రాకేష్ తికాయత్, యోగేంద్రయాదవ్‌లు పాల్గొనబోతోన్నారు. హర్యానా ప్రభుత్వం కర్నాల్ సహా ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీస్ నిలిపివేసింది. 144 సెక్షన్ విధించింది.

ప్యానెల్ కమిటీ సభ్యుడి లేఖ..
అధికారులు ర్యాలీకి అనుమతించలేదు. మహాపంచాయత్ చేపట్టనున్న కర్నాల్‌లోని మార్కెట్ చుట్టూ భారీ సంఖ్యలో భద్రతా దళాలను మోహరించారు. ఈ పరిణామాల మధ్య- దేశ అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన ప్యానెట్ కమిటీ సభ్యుడు, మహారాష్ట్రకు చెందిన షెట్కారీ సంఘటన్ అధ్యక్షుడు అనిల్ జైసింగ్ ఘన్వత్.. లేఖ రాయడం కలకలం రేపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఆయన ఈ లేఖ రాశారు. కొన్ని కీలక అంశాలను ఆయన ఇందులో పొందుపరిచారు.

ముగ్గురు సభ్యుల కమిటీలో..
రైతులు కొనసాగిస్తోన్న నిరసన దీక్షలను పరిష్కరించడానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ కమిటీ అది. ఆ కమిటీలో అనిల్ జైసింగ్ ఘన్వత్ సభ్యుడు. ఆయనతో పాటు డాక్టర్ అశోక్ గులాటి, డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషిని ఇందులో సభ్యులుగా నియమించింది సుప్రీంకోర్టు. ఈ ఏడాది జనవరి 12వ తేదీన సుప్రీంకోర్టు ఈ ప్యానెల్ కమిటీని ఏర్పాటు చేసింది. మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు సుదీర్ఘకాలం పాటు కొనసాగిస్తోన్న ఆందోళనలను విరమింపజేయడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన సూచనలు, సలహాలను ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.

మార్చి 19న నివేదిక..
సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా ఈ కమిటీ- రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, నాయకులతో సంప్రదింపులను నిర్వహించింది. 85 రైతు సంఘాలతో చర్చించింది. వారి నుంచి అందిన సూచనలతో ఓ నివేదికను రూపొందించింది. దీన్ని మార్చి 19వ తేదీన సుప్రీంకోర్టుకు అందజేసింది. సుమారు ఆరునెలల తరువాత కూడా సుప్రీంకోర్టు ఆ నివేదికు బహిరంగ పర్చకపోవడం పట్ల ప్యానెల్ కమిటీ సభ్యుడు అనిల్ జైసింగ్ ఘన్వత్.. అసహనాన్ని వ్యక్తం చేశారు.

ఇప్పటికీ బహిరంగ పర్చకపోవడం పట్ల..
తన అభ్యంతరాలను తెలియజేస్తూ.. సీజేఐ ఎన్వీ రమణకు లేఖ రాశారు. మెజారిటీ రైతులకు ప్రయోజనాన్ని కలిగించేలా ఆ నివేదికను తాము రూపొందించామని, దాన్ని ఇప్పటికి కూడా బహిరంగ పర్చకపోవడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా ఆ నివేదికను ప్రజలందరికీ తెలియజేసేలా బహిర్గతం చేయాలని విజ్ఙప్తి చేశారు. తాము పలువురు రైతులు, రైతు సంఘాల ప్రతినిదులు, నాయకులతో విస్తృతంగా సంప్రదింపులు, చర్చలు నిర్వహించి- నివేదికను రూపొందించామని గుర్తు చేశారు.

ఇన్ని రోజులైనా..
రైతులు తమ ఆందోళనలు, ప్రదర్శనలను ఇప్పటికీ కొనసాగిస్తుండటం తనను కలచి వేస్తోందని అనిల్ జైసింగ్.. తన లేఖలో రాసుకొచ్చారు. ఇన్ని నెలల తరువాత కూడా రైతులు ఎదుర్కొంటోన్న సమస్యలు గానీ, వారి డిమాండ్లు గానీ పరిష్కారానికి నోచుకోలేకపోవడం ఆవేదనకు గురి చేస్తోందని వ్యాఖ్యానించారు. రైతు కుటుంబానికి చెందిన వాడిగా.. ప్యానెల్ కమిటీ సభ్యుడిగా.. తాను తీవ్రంగా కలత చెందుతున్నానని పేర్కొన్నారు.
Recommended Video

దృష్టి పెట్టనట్టుగానే భావిస్తున్నా..
తాము ఇచ్చిన నివేదిక మీద సుప్రీంకోర్టు ఏ మాత్రం ధ్యాస పెట్టలేదని తాను భావిస్తున్నట్లు అనిల్ జైసింగ్ ఘన్వత్.. సీజేఐ ఎన్వీ రమణకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఇప్పటికైనా తాము ఇచ్చిన నివేదికను బహిరంగ పర్చాలని, రైతులకు ప్రయోజనాన్ని, సంతృప్తిని కలిగించేలా.. వారి సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపాలని ఆయన విజ్ఙప్తి చేశారు. ఈ నివేదికలో తాము పొందుపరిచిన సిఫారసులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications