Adani-Hindenberg : అదానీ లెక్క తేల్చడంలో సెబీ ఆలస్యం..సుప్రీంకోర్టు విచారణ వాయిదా..
అదానీ గ్రూప్ లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ జర్మనీకి చెందిన హిండెన్ బర్గ్ సంస్ధ ఇచ్చిన నివేదికపై దాఖలైన కేసులపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. గతంలో ఈ అక్రమాలకు సంబంధించి విచారణ జరపాలంటూ సెబీని ఆదేశించిన సుప్రీంకోర్టు.. ఆ వివరాలు అందించడంలో సెబీ విఫలం కావడంతో మరోసారి విచారణ వాయిదా వేయక తప్పలేదు. ఇప్పటివరకూ 27 అక్రమాల లెక్కలు తేలాల్సి ఉండగా.. ఇందులో సెబీకి 22 నివేదికలు అందాయి. మరో ఐదు మాత్రం ఇంకా అందాల్సి ఉంది.

గతంలో అదానీ గ్రూప్ అక్రమాలపై హిండెన్ బర్గ్ సంస్ధ ఇచ్చిన రిపోర్ట్ నేపథ్యంలో సెబీని సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం ఆగస్టు 14ను గడువుగా విధించింది. అయితే గడువు దాటిన తర్వాత మరో 15 రోజులు దీన్ని పెంచాలని కోరిన సెబీ.. ఆగస్టు 25న స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది. అయితే సెబీ నివేదికలోని అంశాలు ఇంతవరకు బయటపడలేదు. అయితే అదానీ గ్రూప్ కార్యకలాపాలకు సంబంధించిన వివిధ అంశాలకు సంబంధించి మొత్తం 24 పరిశోధనలను కలిగి ఉన్న విస్తృతమైన దర్యాప్తు పురోగతిపై సెబీ ఇచ్చిన రిపోర్ట్ పై చాలా ఊహాగానాలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మరోసారి ఇవాళ ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సెబీని ప్రశ్నించింది. అయితే సెబీ మాత్రం మొత్తం తమకు 27 రిపోర్టులు రావాల్సి ఉండగా.. అందులో 22 మాత్రమే అందాయని, మరో 5 ఇంకా అందాల్సి ఉందని తెలిపింది. దీంతో సుప్రీంకోర్టు విచారణను మరోసారి వాయిదా వేసింది. అయితే ఇప్పటివరకూ తమకు అందిన రిపోర్టుల ఆధారంగా చర్యల్ని నిర్ణయించాల్సి ఉందని సెబీ సుప్రీంకోర్టుకు తెలిపింది.
అదానీ గ్రూప్ లో జరిగిన అక్రమాల వల్ల 12 సంస్ధలు లబ్ది పొందినట్లు సెబీ గుర్తించినట్లు బయట విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సెబీ ఇచ్చిన రిపోర్టు ఇప్పుడు చాలా కీలకంగా మారింది. వీటిపై ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు సెబీ చెబుతున్నా... మిగతా రిపోర్టులు కూడా వస్తేనే అప్పుడు పూర్తి చర్యలు ఖరారవుతాయి. ఆ తర్వాత సెబీ దర్యాప్తుపై సుప్రీంకోర్టు సంతృప్తి చెందితే ఈ కేసు ముగిస్తుంది. లేకపోతే తదుపరి ఆదేశాలు ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications