ఇథనాల్ పై పిల్- విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు: నెక్స్ట్?
దేశంలో వాహనదారులందరినీ ఆందోళనకు గురి చేస్తోన్న అంశం.. ఇథనాల్. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా, ఎలాంటి శాస్త్రీయబద్ధమైన పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టకుండా పెట్రోల్ లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రతిపాదించడం పట్ల వ్యతిరేకత ఎదురవుతోంది. ఇదే విషయంపై కొందరు వాహనదారులు న్యాయస్థానానలను సైతం ఆశ్రయిస్తోన్నారు. దీనిపై తాజాగా సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఇథనాల్ మిశ్రమంపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ ఈ పిటీషన్ వేశారు.
దీన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనిపై విచారణ చేపట్టడానికి నిరాకరించింది. పిటీషన్ లో పొందుపరిచిన అభ్యంతరాలను హైకోర్టు ముందు లేవనెత్తే అవకాశాన్ని కల్పించింది. పెట్రోల్ లో కలిపే ఇథనాల్ శాతాన్ని స్పష్టంగా పెట్రోల్ బంకుల్లో బోర్డులపై ప్రదర్శించాలని, దీనివల్ల ఎంతమేర మిళితం అవుతోందనే విషయం వాహనదారులకు తెలుస్తుందని సీనియర్ అడ్వొకేట్ నరేంద్ర కుమార్ గోస్వామి పిటీషన్ దాఖలు చేశారు.

దీంతో పాటు వినియోగదారులకు ఇచ్చే బిల్లుల్లో కూడా దాని వివరాలను ముద్రించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టడానికి జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ప్రసన్న బీ వరాలేతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. దీన్ని తోసిపుచ్చింది. పిటిషనర్ తన అభ్యంతరాలను హైకోర్టు ముందు లేవనెత్తవచ్చని సూచించింది.
తాము డబ్బులు చెల్లించి కొనుగోలు చేసే ఇంధనంలో ఎంత మేరకు ఇథనాల్ కలుస్తోందో తెలుసుకునే ప్రాథమిక హక్కు వినియోగదారులకు ఉందని నరేంద్ర కుమార్ వాదించారు. పెట్రోల్ బిల్లుల్లో ఎక్కడా ఇథనాల్ ప్రస్తావనే కనిపించట్లేదని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి పెట్రోల్ బంకులోని డిస్పెన్సింగ్ నాజిల్‌పై ఇథనాల్ శాతాన్ని స్పష్టంగా రాయాలని, వాహన తయారీ సంస్థ, మోడల్, ఇంజిన్ రకాన్ని బట్టి ఏ వాహనానికి ఏ రకమైన ఇథనాల్ శాతం అనుకూలంగా ఉంటుందనే పూర్తి డేటాబేస్‌ను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని అభ్యర్థించారు.
దీనివల్ల వినియోగదారులు తమ పాత వాహనాలకు ఏ ఇంధనం సురక్షితమో ముందే తెలుసుకునే వెసలుబాటు కలుగుతుందని అన్నారు. పాత వాహనాల కోసం తక్కువ ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ లభ్యతను కొనసాగించాలని, ఇందుకోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా పిటిషనర్ కోరారు. ఈ20 పెట్రోల్ భవిష్యత్తు ప్రభావాలపై అధ్యయనం చేయడానికి పెట్రోలియం, రవాణా శాఖల ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వాహన మైలేజీ, ఇంజిన్ వారంటీ, పర్యావరణ ప్రభావం, ఇథనాల్ ఉత్పత్తి వల్ల ఎదురయ్యే ఆహార భద్రత వంటి అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై అటార్నీ జనరల్ స్పందిస్తూ.. ఇలాంటి పిటిషన్ గతంలోనే కొట్టివేశారని, దీనిని విచారణకు స్వీకరించకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి భిన్నంగా బెంచ్ స్పందించింది. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టలేమని తేల్చి చెప్పింది. పిటీషనర్ కు హైకోర్టును ఆశ్రయించే వెసలుబాటు కల్పించింది.














Click it and Unblock the Notifications